Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 20 April 2025
webdunia

ఫ్లైట్ ఎక్కాలంటే... పడక సుఖం ఇవ్వాల్సిందే.. ట్రావెల్ ఏజెంట్ అరాచకం

Advertiesment
Hyderabad
, బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (08:38 IST)
హైదరాబాద్ నగరంలో ఓ ట్రావెల్ ఏజెంట్ నిర్వాహకుడు అరాచకాలకు పోలీసులు చెక్ పెట్టారు. గల్ఫ్ దేశాలు వెళ్లేందుకు తనను ఆశ్రయించే అమ్మాయిలు, మహిళలను నయానో భయానో బెదిరించి లొంగదీసుకుని శారీరక సుఖం అనుభవిస్తూ వచ్చాడు. పలువురు అమ్మాయిలను అయితే, గల్ఫ్ ఫ్లైట్ ఎక్కాలంటే తమతో గదిలో గడపాల్సిందేనంటూ షరతు కూడా విధించాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మేడిపల్లికి చెందిన ఓ యువతి.. తన పిన్ని మాదిరిగానే గల్ఫ్‌ దేశాలకు వెళ్లి సంపాదించాలని నిర్ణయించుకుంది. దీంతో.. తన పిన్నిని మస్కట్‌కు పంపిన ఏజెంట్‌ను సంప్రదించింది. అతని ద్వారా ఏపీలోని కడప జిల్లాకు చెందిన నూనె సుబ్బమ్మ, గుండుగుల సుబ్బారాయుడు, సయీద్‌లు పరిచయమయ్యారు. వీరంతా ఆమెను మస్కట్‌ పంపడానికి ఏర్పాట్లు చేశారు. 
 
మంగళవారం ఉదయం ఫ్లైట్‌ ఉందని చెప్పారు. శంషాబాద్‌లో ఒక లాడ్జిలో గది బుక్‌ చేశామని, అక్కడికి వచ్చి తమతో గడపాలని హుకుం జారీ చేశారు. అక్కడికి వస్తేనే అక్కడ పాస్‌పోర్టు, వీసా, ఫ్లైట్‌ టిక్కెట్లు ఇచ్చి.. విమానం ఎక్కిస్తామని తేల్చి చెప్పారు. వారి తీరుపై అనుమానం వచ్చిన ఆ యువతి.. మస్కట్‌లోని తన పిన్నికి ఫోన్‌ చేయగా.. ఆమె ఆ ముఠాను నమ్మొద్దని హెచ్చరించింది. 
 
తనను విజిట్‌ వీసాపై పంపారని, అరబ్‌ షేక్‌లు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ బోరున విలపించింది. దీంతో ఆ యువతి పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన ఎల్‌బీనగర్‌ ఎస్వోటీ ఇన్‌స్పెక్టర్‌ రవి, మేడిపల్లి పోలీసులు.. ఆ యువతితో సహా.. శంషాబాద్‌ చేరుకున్నారు. 
 
ఆమెను కలవడానికి వచ్చిన ఇంతియాజ్‌, సుబ్బమ్మ, సుబ్బారాయుడు, మహమ్మద్‌ హారూన్‌లను అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తులో.. వారంతా మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, హైదరాబాద్‌ ఓల్డ్‌ మలక్‌పేట్‌లోని అల్‌-హయాత్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌కు కూడా ఇందులో పాత్ర ఉందని నిర్ధారించారు. 
 
వీరంతా.. ఒక్కో మహిళను గల్ఫ్‌కు పంపడానికి అరబ్‌ షేక్‌ల వద్ద రూ. 5 లక్షలు తీసుకుంటారని గుర్తించారు. అల్‌-హయాత్‌ నిర్వాహకుడు మహమ్మద్‌ నసీర్‌, అతని కూతురు సుమియా ఫాతిమా, అతని వద్ద పనిచేసే సయ్యద్‌ పరారీలో ఉన్నట్లు సీపీ వెల్లడించారు. 
 
ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నారని, త్వరలో అరెస్టు చేస్తామన్నారు. అరెస్టయిన హారూన్‌ కూడా నసీర్‌ మనిషేనని తెలిపారు. అల్‌-హయాత్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌కు ప్రభుత్వ అనుమతి ఉందని, దాన్ని రద్దుచేయాలని సిఫారసు చేస్తామని మహేశ్‌ భగవత్‌ వివరించారు. ఈ ముఠా ఇప్పటి వరకు 20 మందిని గల్ఫ్‌ దేశాలకు పంపిందని, మరో 40 మందిని పంపేందుకు రంగం సిద్ధం చేసిందని దర్యాప్తులో తేలిందన్నారు. వారినుంచి 40 పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గల్ఫ్‌ దేశాల్లో పనికోసం వెళ్లేవారు ఏజెంట్లను సంప్రదించొద్దని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టామ్‌కో(తెలంగాణ ఓవర్‌సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ)ను సంప్రదించాలని లేదంటే.. విదేశాంగ శాఖ ద్వారా అనుమతి పొందిన అధీకృత ఏజెన్సీలను ఆశ్రయించాలని సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్యాక్సిన్‌ కోల్డ్‌ చైన్‌ను బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా చేసుకున్న గోద్రేజ్‌ అండ్‌ బాయ్‌సీ