హైదరాబాద్ నగరంలోని లోటస్‌పాండ్‌లో ఉన్న వైఎస్ షర్మిల నివాసం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కృష్ణా జలాల విషయంలో షర్మిల వైఖరి తెలపాలంటూ రాయలసీమ రైతులు ఆందోళన చేపట్టారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతామని షర్మిల ఇటీవల ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా ఎదిరిస్తామని తెలిపారు. నీటి కేటాయింపుల్లో తెలంగాణకు ఒక్క చుక్క అన్యాయం జరిగినా సహించేది లేదంటూ ట్వీట్ చేశారు. దీనిపై ఆగ్రహించిన రైతులు షర్మిల నివాసం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. షర్మిల ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆమె ప్రతినిధులు రైతులకు సర్థిచెప్పే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి సైతం ఆందోళనకు దిగింది. ఆ సంఘం ఛైర్మన్ కె.శ్రీనివాసులు ఆధ్వర్యంలో పలువురు అక్కడ నిరసన తెలిపారు. ఈ క్రమంలో వారితో షర్మిల అనుచరులు వాగ్వాదానికి దిగారు.
మరోవైపు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఫిర్యాదులు వస్తోన్న విషయం తెలిసిందే. ఏపీ చర్యల వల్ల పర్యావరణ సమస్యలు వస్తాయంటూ తెలంగాణకి చెందిన శ్రీనివాస్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌కి ఫిర్యాదు చేయడం, ట్రైబ్యునల్ ఆదేశాలతో కేంద్ర పర్యావరణ శాఖ ఓ కమిటీని నియమించడం జరిగింది.
ఏపీ నిర్ణయాలపై తెలంగాణ ప్రభుత్వం కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే, దీనిపై ఏపీ ప్రభుత్వం మాత్రం నిబంధనల ప్రకారమే పనులు జరుగుతున్నాయని అంటోంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ప్రధాన విద్యుదుత్పత్తి కేంద్ర వద్ద అధికారులు 100 పోలీసులను మోహరించారు. గతంలో అక్కడ చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.