"తెలంగాణ ఏర్పడే నాటికి వ్యవసాయరంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. అన్నదాతలు వ్యవసాయం మీద ఆశలు వదులుకున్నారు. కేవలం ఐదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టి, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరంటు, రైతుబంధు, రైతుభీమా పథకాలను ప్రవేశపెట్టడంతో రైతులకు ధైర్యం వచ్చిందని, ఐదేళ్లలో ఆత్మహత్యల నుండి ఆత్మగౌరవం వైపు మళ్లించారు" అని తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
సచివాలయం డి బ్లాక్ సమావేశ మందిరంలో తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం హ్యాండ్ బుక్ ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయం అంటే భయపడే పరిస్థితి నుండి వ్యవసాయం చేస్తే ధీమాగా బతకగలం అన్న పరిస్థితులు లక్ష్యంగా పనిచేస్తున్నామని, వ్యవసాయ శాఖలో పనిచేయడం అదృష్టమని, ఈ శాఖలో పనిచేయడం మూలంగా వచ్చే సంతృప్తి మిగతా శాఖలలో ఉండదని, రైతుల కళ్లలో ఆనందమే మీరు మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు ఉత్సాహాన్ని ఇస్తుందని మంత్రి అన్నారు.
వ్యవసాయ శాఖలో పదోన్నతులపై ఓ కమిటీని ఏర్పాటుచేసి పారదర్శకంగా పదోన్నతులు ఇచ్చేలా చూస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యవసాయ శాఖ కార్యాలయాలలో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.
తెలంగాణలోని వ్యవసాయ రంగ పథకాలే ఇప్పుడు దేశానికి ఆదర్శం అయ్యాయని, తెలంగాణ రైతుబంధు పథకమే ప్రధానమంత్రి సమ్మాన్ యోజన అమలుకు మార్గదర్శకం అయిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నింటా ముందు ప్రజలకు లబ్ది చేకూర్చే పనులు చేసుకుంటూ వస్తున్నారని, వ్యవసాయ శాఖలోని ఉద్యోగుల ఇబ్బందులు కూడా ఖచ్చితంగా తీరుస్తారని, ఉద్యోగులు కాస్తంత ఓపికగా ఎదురుచూడాలని అన్నారు.
ఉద్యోగుల సంఘం ద్వారా ఉత్తమ రైతులకు అవార్డులు ఇవ్వడం అభినందనీయమని, తెలంగాణ ప్రభుత్వం నుండి కూడా ప్రతి ఏటా ఉత్తమ రైతులకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తామని, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వారి సూచనల మేరకు ఈ అవార్డులకు శ్రీకారం చుడతామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం రాష్ట్ర చైర్మన్ కృపాకర్ రెడ్డి, అధ్యక్షురాలు అనురాధ, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, రిటైర్డు ఉద్యోగుల సంఘం నేతలు శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.