కస్టమ్స్ అధికారినంటూ ప్రజలను మోసం చేసి తప్పించుకుని తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సౌమన్ బెనర్జీని మల్కాజిగిరి ఎస్.ఓ.టీ పోలీసులు అరెస్ట్ చేశారు.
2013 సంవత్సరం నుండి మోసాలకు పాల్పడుతున్న అతడిని.. మూడు సంవత్సరాల పాటు గాలించి, ఎట్టకేలకు ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో తనకు తాను కస్టమ్స్ అధికారినంటూ పరిచయం చేసుకుని తక్కువ రేటుకు బంగారం ఇప్పిస్తానని ప్రజలను మోసం చేస్తున్నాడు.
వారివద్ద నుంచి డబ్బులు కాజేసి తప్పించుకు తిరుగుతున్నాడు. 2013 సంవత్సరం నుండి ఇతని దందా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
నకిలీ ఐడి కార్డ్, ఆధార్ కార్డులు, నకిలీ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు తయారు చేసి ఒక్కోచోట ఒక్కొక్క విధంగా అవతారమెత్తి ప్రజలను మోసం చేస్తున్నాడు.
కస్టమ్స్ ఆఫీసర్ ముసుగులో ప్రజలను మోసం చేసినందుకు కోల్‌కతాకు చెందిన సౌమెన్ బెనర్జీని మల్కాజ్‌గిరి జోన్ ఎస్.వో.టి పోలీసులు ఎంతో శ్రమకోర్చి పట్టుకున్నారు. ఇతను బాధితుల వద్దనుండి భారీగా వసూలు చేసి దానికి బదులుగా బంగారు నాణేలు మరియు పెట్టుబడులపై 30 శాతం వడ్డీని ఇస్తామంటూ 5 కోట్ల రూపాయలను సేకరించినట్లు ప్రాధమిక విచారణలో తేలింది.
అతని వద్ద నుంచి నకిలీ కస్టమ్స్ ఆఫీసర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డులు, ఓటరు ఐడి కార్డులు, స్టాంపులు, ఒక లక్ష నగదు, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.