నల్గొండ హుజూర్ నగర్ మండలంలో గోవిందాపురంలో చేతబడి అనుమానంతో కొందరు యువకులను స్థానికులు చితకబాదారు. శ్రీకాంత్, రాము, రవి, వెంకటేశ్వర్లు అనే నలుగురు యువకులు గురువారం రాత్రి శ్మశానంలో క్షుద్ర పూజలు నిర్వహించారు. ఖమ్మం, ఒంగోలు ప్రాంతాలకు చెందిన భూతవైద్యులు మంత్రాలు చదవగా యువకులు అదే మంత్రాలను పఠిస్తూ పూజలు చేశారు.
ఇది గమనించిన స్థానికులు వారిపై దాడికి దిగారు. దాంతో నలుగురిలో ఓ యువకుడు పారిపోయాడు. అయితే మరునాడు ఉదయం గ్రామస్తులు ఆ యువకుడిని పిలిపించి విచారించగా ఒకదానికొకటి సంబంధం లేని సమాధానాలు చెప్పసాగాడు. దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు యువకులను చితకబాదారు.
అనుమానం చెందిన గ్రామస్తులు వారిని శ్మసానానికి తీసుకెళ్లి చూపించమన్నారు. అక్కడ సోదాలు చేయగా మట్టిలో పూడ్చిన ఇద్దరు మహిళలు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు ఓ చీర, జాకెట్, నిమ్మకాయలు, వెంట్రుకలు, రెండు నళ్ల కోళ్లు కనిపించాయి. దాంతో యువకులు క్షుద్ర పూజలు చేస్తున్నారని పోలీసులకు వారిని అప్పగించారు.
ఆ యువకులు చెప్పింది విన్న ఎస్సై వారిని మందలించి పంపేశారు. ఆ ఫోటోలు తమ కుటుంబానికి చెందినవారివేనని, తమ కుటుంబంలో కొన్నాళ్లుగా సమస్యలున్నాయని వాటికి పరిష్కారంగా పూజలు నిర్వహిస్తే తొలగిపోతుందని ఒంగోలుకు చెందిన ఓ పూజారి చెప్పడంతో ఆ పూజలు నిర్వహించామని యువకులు తెలిపారు. తాము చేతబడి చేస్తున్నామని గ్రామస్తులు మమ్మల్ని కొట్టారని యువకులు తెలిపారు.