Publish Date: Thu, 16 Jul 2020 (07:38 IST)
Updated Date: Thu, 16 Jul 2020 (07:40 IST)
మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలోని ఎక్కలదాయమ్మ చెరువు కట్టమీద నుంచి అక్రమంగా కర్ర లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో లారీలో ఉన్న నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో మొత్తం 11 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటరమణ, సీఐ చేరాలు, ఎస్సై నగేష్, ఆర్డీవో ఈశ్వరయ్య, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఈ ఘటనలో సురక్షితంగా బయటపడ్డ ఏడుగురు కూలీలు రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం అంబోతులా తండకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ప్రమాదంలో మృతి చెందిన వారిలో హర్యా, గోవిందర్, మధు, ధూర్యా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.