Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం... లారీ, ట్రాక్ట‌ర్ ఢీ.. 12 మంది దుర్మ‌ర‌ణం

Advertiesment
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం... లారీ, ట్రాక్ట‌ర్ ఢీ.. 12 మంది దుర్మ‌ర‌ణం
, బుధవారం, 17 జూన్ 2020 (21:01 IST)
కృష్ణా జిల్లాలో ఘోర‌ రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం వేదాద్రి వ‌ద్ద ట్రాక్ట‌ర్‌, లారీ ఢీ కొన్న ఘ‌ట‌న‌లో 12 మంది దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ట్రాక్ట‌ర్‌లో ప్ర‌యాణిస్తున్న ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా మ‌రో ఐదుగురు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వ‌దిలారు.

మృతుల్లో చిన్నారులు, మ‌హిళ‌లు ఉన్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద గోపవరం గ్రామానికి చెందిన కుటుంబం బంధువులతో కలిసి వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి మొక్కులు తీర్చుకునేందుకు వెళ్లి వస్తున్నారు.

ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను ఎదురుగా వచ్చిన బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

మృతుల్లో పెద గోపవరంతో పాటు అదే మండలానికి చెందిన జమలాపురం, కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని జయంతి గ్రామానికి చెందిన వారు కూడా ఉన్నారు.

పెదగోపవరం గ్రామానికి చెందిన ముడి పద్మావతి (15), వేమిరెడ్డి ఉదయశీ (6). రాజి (27), అక్కన్న (45), వేమిరెడ్డి భారతమ్మ (45) వేమిరెడ్డి కల్యాణి (16), శీలం శ్రీలక్ష్మి (19), జయంతి గ్రామానికి చెందిన గూడూరు ఉపేంద్రరెడ్డి (15), గూడూరు సత్య నారాయణరెడ్డి (16), గూడూరు రమణమ్మ (40), జమలాపురం గ్రామానికి చెందిన ల‌చ్చిరెడ్డి అప్ప‌మ్మ (40), ల‌చ్చిరెడ్డి తిరుపతమ్మ (60) ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

గాయపడ్డవారిని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖ‌మ్మం తరలించారు. నందిగామ డీఎస్పీ ర‌‌మ‌ణమూర్తి, సీఐ నాగేంద్రకుమార్, ఎస్సై  అభిమ‌న్యు కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఘ‌ట‌నా స్థలాన్ని జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యే సామినేని ఉద‌య‌భాను సంద‌ర్శించి మృతుల కుటుంబ‌స‌భ్యుల‌ను ఓదార్చారు. 
 
తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి... 
కృష్ణా జిల్లా ప్ర‌మాద ఘ‌ట‌న స‌మాచారం తెలిసిన వెంట‌నే తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల‌కు సంతాపం తెలిపారు. క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. అదేవిధంగా ఏపి గ‌ర‌వ్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

మరణించిన వారి కుటుంబ సభ్యులకు గవర్నర్ హరిచందన్ ప్రగాడ సానుభూతి, హృదయపూర్వక సంతాపం ప్రకటించారు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌మ ప్ర‌గాడ సంతాపాన్ని వెలిబుచ్చారు. క్ష‌త‌గాత్రులు త్వ‌రిత‌గ‌తిన‌ కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. 
 
ప‌వ‌న్‌క‌ల్యాణ్ దిగ్భ్రాంతి
కృష్ణా జిల్లా వేదాద్రి దగ్గర చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో 12 మంది చనిపోయారని తెలిసి దిగ్భ్రాంతికి లోనైన‌ట్లు జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. మృతుల కుటుంబాలకు వ్య‌క్తిగ‌తంగానూ జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాల‌న్నారు.

తెలంగాణలోని పెద గోపవరం గ్రామస్తులు వేదాద్రి నరసింహ స్వామి దర్శనం చేసుకొని వస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకొందని తెలిసింది. ప్రమాద బాధితులకు అవసరమైన సహాయం, వైద్యం విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో సేవలు అందించాలని కోరారు. లారీ ఢీ కొట్టడంతో ఘటనా స్థలంలోనే ఏడుగురు చనిపోయారంటే ప్ర‌మాదం ఎంత తీవ్రంగా చోటుచేసుకొందో అర్థమ‌వువుతోంది.

గ్రామీణ ప్రాంతాల్లో సైతం మితిమీరిన వేగంతో లారీలు, ఇసుక టిప్పర్లు, ఇతర సరుకు రవాణా వాహనాలు తిరుగుతున్నాయని, భయమేస్తోందని ప్రజలు వాపోతున్నారు. రవాణా, పోలీసు శాఖలు ఈ వేగానికి కళ్ళెం వేసి, రహదారి భద్రత నియమాలు అమలుచేయాల‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫోన్లో మాట్లాడుకున్న భారత్-చైనా దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులు