గత కొన్ని రోజులుగా తనపై విమర్శలు గుప్పిస్తున్న తెరాస నేత, మంత్రి గంగుల కమలాకర్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన తెరాస నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ముఖ్యంగా, హుజూరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్ర ఈటల మాట్లాడుతూ, గంగులను తీవ్రంగా హెచ్చరించారు. 'బిడ్డా గంగులా... అధికారం ఎవడికీ శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకో' అని వ్యాఖ్యానించారు.
కరీంనగర్ సంపదను విధ్వంసం చేశావని, జిల్లాను బొందలగడ్డగా మార్చావని ఈటల దుయ్యబట్టారు. పైరవీలు చేసుకుని మంత్రి అయిన చరిత్ర నీదని... నీలాంటి చరిత్ర తనది కాదని అన్నారు. నీలాంటి వ్యక్తుల బెదిరింపులకు తాను భయపడనని చెప్పారు.
మంత్రిగా ఉన్న తర్వాత సభ్యత, సంస్కారం ఉండాలని అన్నారు. హుజూరాబాద్ ప్రజలను నువ్వు వేధిస్తున్నావంటూ విరుచుకుపడ్డారు. ఈరోజు తనపై విమర్శలు చేస్తున్న నేతలు ఒక్కరోజైనా ప్రజల బాధలను పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు.
నువ్వు ఎన్ని ట్యాక్సులు ఎగ్గొట్టావో ఎవరికి తెలియదు? అని ఈటల అన్నారు. నీ కథ మొత్తం తనకు తెలుసని... సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతానని... 2023 తర్వాత నీవు ఉండవని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
2006 ఎన్నికల్లో దివంగత రాజశేఖరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎంత డబ్బు ఖర్చు చేసినా, ఎందరో నేతలను కొన్నా... తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్నే గెలిపించారని అన్నారు. ఇప్పుడు కూడా హుజూరాబాద్‌లో అదే జరుగుతుందని చెప్పారు. తాను ఎంతో సంస్కారంతో వ్యవహరిస్తున్నానని... లేకపోతే మాడిమసైపోతారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొన్నటి ఎంపీ ఎన్నికల్లో మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌కు తక్కువ ఓట్లు వస్తే... 54 వేల ఓట్ల మెజారిటీతో హుజూరాబాద్ ఆదుకుందని చెప్పారు. హుజూరాబాద్ ప్రజలను, వారి ఆత్మగౌరవాన్ని ఎవరూ కొనలేరని అన్నారు. తన ప్రజల మీద ఈగ కూడా వాలనివ్వనని ఈటల ప్రకటించారు.