హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ సరఫరా కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్‌ను నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. గోవా నుంచి హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న కేసులో ఎడ్విన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను శనివారం సాయంత్రం హైదరాబాద్ నగరానికి తీసుకునిరానున్నారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న నారాయణ బోర్కర్‌ను నార్కోటిక్ విభాగం పోలీసులు గత మూడు నెలల క్రితం అరెస్టు చేసి విచారించారు. ఈ విచారణలో ఎడ్విన్ పేరును బహిర్గతం చేశాడు. బోర్కర్ ఇచ్చిన సమాచారంతో గోవాలో ఎడ్విన్‌పై నార్కోటిక్ విభాగం పోలీసులు నిఘా ఉంచారు. గత మూడు నెలలుగా సాగుతున్న ఈ నిఘాలో పోలీసుల కన్నుగప్పి ఎడ్విన్ తప్పించుకుని తిరుగుతున్నారు.
ఈ క్రమంలో గత 15 రోజులుగా గోవాలోనే మకాం వేసిన నార్కోటిక్ పోలీసులు ఎడ్విన్ కదలికలపై నిఘా వేసి అరెస్టు చేశారు. గోవా నుంచి శనివారం రాత్రికి హైదరాబాద్ నగరానికి తీసుకునిరానున్నారు. కాగా, దేశ వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరాలో ఎడ్విన్ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు.