గుజరాత్ రాష్ట్రంలోని మచ్చూ నదిపై 150 యేళ్ల క్రితం నిర్మించిన పురాతన కేబుల్ వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 150 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. మరికొందరు గల్లంతయ్యారు. అయితే, ఈ వంతెనకు మరమ్మతు పనులను రూ.2 కోట్లతో పూర్తి చేశారు. ఈ పనులు పూర్తి చేసి తిరిగి అందుబాటులోకి తెచ్చిన తర్వాత ఈ వంతెన కూలిపోవడం గమనార్హం.
పైగా, మరమ్మతులు చేపట్టిన కంపెనీ ఒరెవాకు ఏమాత్రం ఇంజనీరింగ్, నిర్మాణ రంగంలో అనుభవం లేదు. ఇది ఒక గోడ గడియారాల కంపెనీ. ఈ నేపథ్యంలో ఈ కేబుల్ వంతెన కూలిపోవడంతో ఒరెవా స్పందించింది. కేబుల్ వంతెనపైకి పరిమితికి మంచి పర్యాటకులు ఎక్కడం వల్లే కూలిపోయిందని, ఇందులో తమ తప్పేమి లేదని సులభంగా వివరణ ఇచ్చింది.
అయితే, ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు (సిట్) ఒరెవా యజమానితో సహా ఎనిమిది మందిని అరెస్టు చేసింది. గుజరాత్ ప్రభుత్వంతో ఒరెవా కంపెనీ చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ.2 కోట్ల ఖర్చుతో మోర్బీ వంతెనకు మరమ్మతులు చేపట్టినట్టు గోడ గడియారాల కంపెనీ అయిన ఒరెవా వెల్లడించింది.
ఈ మరమ్మతులతో బ్రిడ్జికి పదేళ్లపాటు గ్యారెంటీ ఇచ్చినట్టు తెలిపింది. ఇక మరమ్మతుల తర్వాత వంతెనపై 125 మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయించామని తెలిపిన ఒరెవా... ఆదివారం ఒకేసారి 500 మంది పర్యాటకులను వంతెనపైకి అనుమతించారని ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని వివరణ ఇచ్చింది.
ఇదిలావుంటే, ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఒరెవా కంపెనీ యజమాని, మరమ్మతులు పర్యవేక్షించిన సంస్థ అధికారులతో పాటు మొత్తం 8 మందిని అరెస్టు చేసింది. మరోవైపు, వంతెనపై కొందరు యువకులు చేసిన డ్యాన్స్ విన్యాసాల కారణంగానే వంతెన కూలిపోయిందంటూ వస్తున్న వార్తలపైనా సిట్ దృష్టిసారించింది.