వడోదర రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణమయ్యారని పేర్కొంటూ నమోదైన కేసులో బాలీవుడ్ అగ్రహీరో షారూక్ ఖాన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. తద్వారా ఈ కేసులో బాలీవుడ్ బాద్ షాకు పెద్ద ఊరట లభించినట్టయింది.
గత 2017లో "రాయిస్" చిత్ర ప్రమోషన్‌లో భాగంగా షారూక్ తన చిత్ర బృందంో కలిసి ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆయనను చూసేందుకు వడోదర రైల్వే స్టేషన్‌కు పోటెత్తారు. షారూక్ వారిపై టీషర్టులు, స్మైలీ బాల్స్ విసిరారు. వీటిని చేజిక్కించుకునే ప్రయత్నంలో ఒక్కసారిగా రైల్వే స్టేషనులో తొక్కిసలాట చోటుచేసుకుంది.
ఈ తొక్కిసలాట ఘటనకు షారూక్ ప్రధాన కారకుడని పేర్కొంటూ ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జితేంద్ర మధుబాయ్ సోలంకి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసును కొట్టివేయాల్సిందిగా కోరుతూ షారూఖ్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేసును విచారించిన కోర్టు షారూఖ్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది.
గుజరాత్ హైకోర్టు తీర్పును ఫిర్యాదుదారుడు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. నిన్న దీనిని విచారించిన జస్టిస్ రస్తోగి, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం షారూఖ్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. గుజరాత్ హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.