ఇంట్లోకి రాత్రి పూట మొసలి వచ్చింది. అవును షాకింగ్‌గా వుంది కదూ.. అవును.. మొసలి రావడం చూసి ఆ కుటుంబం ఉలిక్కిపడింది. రాత్రంతా మొసలితోనే గడిపారు. తెల్లారి అధికారులు వచ్చి సహాయక చర్యలు చేపట్టేవరకు ప్రాణాలు అరచేత పట్టుకుని గడిపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్, ఎతావా పరిధిలోని జైతియా అనే గ్రామంలో గత శనివారం రాత్రి జరిగింది.
వివరాల్లోకి వెళితే.. జైతియా గ్రామంలోని హర్‌నామ్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లోకి రాత్రి ఒక మొసలి ప్రవేశించింది. ఏదో శబ్ధం వచ్చిందని మేల్కొని చూసే సరికి ఇంట్లో ఎనిమిది అడుగుల మొసలి కనిపించింది. వెంటనే భయాందోళనకు గురైన ఆ కుటుంబం పోలీసులకు సమాచారం అందించింది.
తర్వాత ఉదయం ఆరు గంటలకు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది ఆ ఇంటికి చేరుకుని మొసలిని పట్టుకునే ప్రయత్నం చేశారు. దాదాపు గంటసేపు శ్రమించి, మొసలిని సురక్షితంగా బంధించారు.
తర్వాత మొసలిని అటవీశాఖ సిబ్బంది రక్షణ ప్రదేశానికి తీసుకెళ్లారు. దీంతో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ, ప్రాణాలు అరచేత పట్టుకుని గడిపిన ఇంట్లోని వాళ్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ మొసలిని సురక్షితమైన నీటి ప్రదేశంలో వదిలిపెడతామని అధికారులు చెప్పారు.