తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో ఈ కేసులు అడ్డూఅదుపులేకుండా పెరుగుతున్నాయి. దీంతో మళ్లీ లాక్డౌన్ అమలు చేయనున్నారనే రుమార్లు గుప్పుమంటున్నాయి.
వీటిపై ఆ రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయనీ, అందువల్ల లాక్డౌన్ విధించే అంశంపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటారని తెలిపారు.
అదేసమయంలో కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రజలు తమ ఇళ్లు వదిలి బయటకు రావొద్దంటూ ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ.. వారు పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. పైగా, ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని ఆయన కోరారు.
అంతేకాకుండా, ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అదేసమయంలో కరోనా అంశాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయ డ్రామాలకు తెరతీసిందని, రాష్ట్ర బీజేపీ నేతలు కరోనా విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచన చేశారు.