తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. దీంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహించింది. ఫలితంగా గోదావరి నది పరివాహక జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ వరద ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఆదివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా క్లౌడ్ బరస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కుండపోత వర్షంపై ఏవో కొన్ని కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారని.. ఇవి ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియదన్నారు. విదేశీయులు కావాలనే మన దేశంలో అక్కడక్కడా 'క్లౌడ్ బరస్ట్' చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ఇవి ఎంత వరకు నిజమో తెలియదన్నారు.
గతంలో జమ్మూకాశ్మీర్‌లోని లేహ్, లద్దాఖ్.. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లో ఇలా చేశారన్నారు. ఇటీవల గోదావరి పరీవాహక ప్రాంతంపై అలా చేస్తున్నట్లు ఓ సమాచారం వచ్చిందన్నారు. ఏదేమైనా ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.