భారీ వర్షాల కారణంగా భద్రాద్రి నీట మునిగింది. వారం రోజుల పాటు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. భద్రాచలం వద్ద నీటి మట్టం రికార్డు స్థాయిలో ప్రవహిస్తోంది.
36 ఏళ్ల తర్వాత మళ్లీ గోదావరి ఉగ్రరూపం దాల్చి.. 70 అడుగులను దాటి ఉరకలు వేస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం వరకే ఈ రికార్టును చెరిపేయగా.. రాత్రి వరకు 75 అడుగుల వరకు నీటి మట్టం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు వరద ఉధృతి అధికం కావడంతో భద్రాచలం పట్టణం నీట మునిగింది. రెండు రోజులు క్రితమే లోతట్టు ప్రాంతాలు మునిగిపోగా.. శుక్రవారం తెల్లవారు జాము వరకు ఎగువ ఉన్న ప్రాంతాలను సైతం వరద నీరు చుట్టుముట్టింది.
ప్రస్తుతం గోదావరి, భద్రాచలం పట్టణం రెండు కలిసి పోయాయి. రోడ్లు, వీధులు, రామాలయం మాడ వీధులు పూర్తిగా నీట మునిగాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులతో కలిసి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తూ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.