ఏటా జులై, ఆగష్టు నెలల్లో గోదావరికి వరద తాకిడి కనిపిస్తుంది. ఈ సమయంలో వివిధ ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. తెలంగాణలోని పేరూరు నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ వరకూ నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు అధికారికంగా వెల్లడిస్తూ ఉంటారు. నదీ ప్రవాహం స్థాయిని బట్టి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారు. వాటిని బట్టి దిగువ ప్రాంతాల ప్రజలు వ్యవహరించాల్సి ఉంటుంది. ఇంతకీ గోదావరి నదీ ప్రవాహంలో ప్రమాద హెచ్చరికలు ఏమిటీ, వాటిని ఏ స్థాయిలో విడుదల చేస్తారు, అవి అమలులోకి వచ్చినప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటీ?
ఏటా మూడు నెలల పాటు..
తెలుగు రాష్ట్రాల పరిధిలో అతి పెద్ద నదిగా గోదావరి ఉంది. మహారాష్ట్రలో ప్రస్థానం ప్రారంభించి, తెలంగాణ మీదుగా ఏపీ తీరంలో బంగాళాఖాతానికి ఈ నదీ ప్రవాహం చేరుతుంది. మార్గం మధ్యలో అనేక ఉపనదుల చేరికతో రాజమహేంద్రవరం ప్రాంతంలో ఇది అఖండ గోదావరిగా మారుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దిగువన పలు పాయలుగా సాగుతుంది. ఏటా జులై నుంచి సెప్టెంబర్ వరకూ గోదావరిలో వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహరాష్ట్రలో భారీ వర్షాలు కురిసిన తర్వాత దాని ప్రభావం గోదావరి నీటిమట్టం మీద పడుతుంది.
బాబ్లీ నుంచి విడుదలయ్యే నీటితో శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌కు వరద తాకిడి చేరుతుంది. అక్కడ నుంచి ప్రస్తుతం కాళేశ్వరం, దాని దిగువన భద్రాచలం, పోలవరం, ధవళేశ్వరం బ్యారేజ్ వరకూ ఈ వరద తాకిడిని ఎప్పటికప్పుడు అధికారులు అంచనా వేస్తుంటారు. గోదావరి నదికి ఉపనదుల నుంచి కూడా ఎక్కువ వరద నీరు చేరుతుంది. అందులో ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి, పెన్ గంగా వంటి నదులున్నాయి. ముఖ్యంగా ప్రాణహిత, శబరి వంటి ఉపనదుల నుంచి ఎక్కువగా వరద నీరు గోదావరికి చేరుతుంది. తెలంగాణలో కురిసిన వర్షాలతో ప్రాణహిత, ఇంద్రావతికి వరద ప్రవాహం పెరిగితే, ఛత్తీస్‌గఢ్‌లో కురిసే వర్షాలతో శబరి ప్రవాహం ఉద్ధృతంగా సాగుతుంది. ఆయా నదుల నుంచి వరద నీటితో పోలవరం, ధవళేశ్వరం వద్ద వరద ఎక్కువగా కనిపిస్తుంది.
వరద అంచనాలు అక్కడే...
ప్రస్తుతం తెలంగాణలోని కాళేశ్వరం, పేరూరు, దుమ్ముగూడెం, భద్రాచలం వద్ద వరద ప్రవాహాన్ని నీటిపారుదల అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వరద నిర్వహణ చేస్తుంటారు. ఆయా ఉపనదులు వచ్చి గోదావరిలో కలిసిన తర్వాత వాటికి దిగువన వరద తాకిడిని కొలిచేందుకు ప్రయత్నిస్తారు. నీటిమట్టం ఆధారంగా డిశ్చార్జ్‌ను కొలుస్తారు. ఏపీలోని పోలవరం, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద లెక్కలు సేకరిస్తూ ఉంటారు. వరదల సమయంలో అన్ని చోట్లా వివరాలను ప్రతీ గంటకు బులిటెన్ రూపంలో వెల్లడిస్తూ ఉంటారు. గోదావరిలో ఏర్పాటు చేసిన కొలమానం ఆధారంగా నీటిమట్టం నీటి ప్రవాహాన్ని కొలుస్తూ అధికారికంగా వెల్లడిస్తూ ఉంటారు. ప్రవాహ స్థాయిని బట్టి ప్రజలను అప్రమత్తం చేయడం, వరద నిర్వహణ చర్యలకు ఉపక్రమించడం జరుగుతుంది. ఆ సమయంలో వివిధ దశలో హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. మొదటి, రెండవ, మూడవ ప్రమాద హెచ్చరికలు విడుదలవుతూ ఉంటాయి.
గోదావరి వరదల చరిత్ర ఇదే
1950 నుంచి 2022 వరకూ గోదావరికి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నమోదయిన లెక్కల ప్రకారం 37 సార్లు వరదలు వచ్చాయి అందులో 24 సార్లు ఆగష్టులోనే వరదలు వచ్చాయి. నీటి వనరుల శాఖ గోదావరి హెడ్ వర్క్స్ నివేదికల ప్రకారం.. 1953 ఆగష్టు 19న 30,03,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అప్పట్లో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఆనకట్ట ఉండేది. దానికి 48 గేట్లు ఉండేవి. ఆ తర్వాత 1978లో కొత్త బ్యారేజ్ అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఆగష్టు 16, 1986లో చరిత్రలోనే అతిపెద్ద వరదలు నమోదయ్యాయి. ఆనాడు 35,06,388 క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు. ఆనాటి వరదల్లో గోదావరి జిల్లాలకు అపార నష్టం సంభవించింది. వందల గ్రామాలు జలమయమయ్యాయి. ఆ తర్వాత ఆగష్టు 25, 1990 నాడు 27,88,700 క్యూసెక్కుల వరద ప్రవాహం బ్యారేజ్ వద్ద నమోదయింది.
ఆ తర్వాత దశాబ్దంన్నర పాటు మళ్లీ పెద్ద వరదలు నమోదు కాలేదు. కానీ ఆగష్టు7, 2006న మరోసారి పెద్ద వరదలు వచ్చాయి. 28,50,664 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదయింది. ఆ సమయంలో కోనసీమలోని శానపల్లిలంక, మొండెపులంక ప్రాంతాల్లో గోదావరి కట్టలు తెగి వరద ప్రవాహం ఊళ్లలో ప్రవేశించింది. భారీ సంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. అపార ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఆగష్టు 9, 2010లో 20,05,299 క్యూసెక్కులు, ఆగష్టు 4, 2013 నాడు 21,18,170 క్యూసెక్కుల ప్రవాహం సాగింది. 2020లో కూడా 27 లక్షల క్యూసెక్కుల వరద నమోదయింది.
హెచ్చరికలు ఎప్పుడు?
ప్రస్తుతం భద్రాచలం, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. వాటికి దిగువన గోదావరిని ఆనుకుని ఎక్కువ జనావాసాలు ఉండడం, వరద ప్రవాహ స్థాయి ప్రభావానికి ఎక్కువ మంది గురవుతుండడం వల్ల ఈ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారని నీటిపారుదల శాఖ గోదావరి హెడ్ వర్క్స్ డీఈ ప్రదీప్ కుమార్ బీబీసీకి తెలిపారు. భద్రాచలం వద్ద 43 అడుగులకు నీటిమట్టం చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 48 అడుగులను వరద తాకిడి తాకితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. అదే 53 అడుగుల దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసి రెడ్ అలెర్ట్ ప్రకటిస్తారు.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 11.75 అడుగుల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక విడుదలవుతుంది. నీటిమట్టం 13.75 అడుగులను దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. వరద ప్రవాహం 17.75 అడుగులను చేరితే మూడో ప్రమాద హెచ్చరిక వస్తుంది. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరిన సమయానికి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 10లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతారు. రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని 13 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంటుంది. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే సమయానికి 17లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంటుంది. దానిని దాటి గడిచిన 20 ఏళ్లలోనే 8 సార్లు వరద తాకిడి నమోదు కావడం విశేషం.
ఏ హెచ్చరిక ఏం చెబుతుంది...
మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని చేరగానే నదిలో బోటు ప్రయాణాలు సహా వివిధ ఆంక్షలు అమలులోకి వస్తాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు. లంకవాసుల రాకపోకలకు కూడా అవకాశం లేదు. రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి వస్తే అనేక ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమవుతుంది. రెవెన్యూ, ఇరిగేషన్ సిబ్బంది కలిసి ఏటిగట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. గట్లు బలహీనంగా ఉన్నాయని భావిస్తే ఆయా ప్రాంతాల్లో అవసరమైన ఇసుకబస్తాలు వంటి రక్షణ చర్యలకు పూనుకుంటారు.
మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరితే ధవళేశ్వరంలో బ్యారేజ్ నిర్వహణ కూడా సూపరింటెండెంట్ ఇంజనీర్ పర్యవేక్షణలోకి వెళుతుంది. జిల్లా కలెక్టర్‌కు ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలియజేస్తూ అవసరమైన అన్ని చర్యలకు ఉపక్రమిస్తారు. ప్రభుత్వ యంత్రాంగమంతా వరద నిర్వహణలోకి వెళుతుంది. ముఖ్యమైన శాఖల సిబ్బందికి సెలవులు కూడా రద్దవుతాయి. అన్ని వేళలా ఇరిగేషన్ సిబ్బంది అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. ఏ సమస్య వచ్చినా యుద్ధ ప్రాతిపదికన రంగంలో దిగేందుకు యంత్రాంగం అప్రమత్తం కావాలి. భద్రాచలంలో కూడా మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి గోదావరి ప్రవాహం ఉంటే నేరుగా సబ్ కలెక్టర్ పర్యవేక్షణలోకి మారుతుంది.