Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీలంక సంక్షోభం లాంటిదే పాకిస్తాన్, నేపాల్ దేశాలలోనూ వస్తే ఏమవుతుంది?

Advertiesment
srilanka president house
, మంగళవారం, 12 జులై 2022 (11:14 IST)
ప్రస్తుతం శ్రీలంకను తీవ్రమైన సంక్షోభం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దక్షిణ ఆసియాలోని మరికొన్ని దేశాల ఆర్థిక పరిస్థితి కూడా దాదాపు ఇలానే కనిపిస్తోంది. ఈ సంక్షోభాలు మరింత ముదరకుండా అడ్డుకునే సామర్థ్యం ఆయా దేశాల్లోని రాజకీయ నాయకులకు ఉందా? వరుసగా భారత్ పొరుగునున్న దేశాల్లో రాజకీయ సంక్షోభాలతోపాటు ఆర్థిక పరిస్థితులు కూడా ఇంతలా దిగజారడం చాలా విచిత్రంగా అనిపిస్తోంది. శ్రీలంకను ‘‘విఫలమైన దేశం’’గా మనం ముందెన్నడూ ఊహించుకోలేదు. కొన్ని సంవత్సరాల ముందువరకు శ్రీలంక ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉండేది. సామాజిక అంశాల్లోనూ శ్రీలంక మరీ అంత వెనుకబడి లేదు.

 
మూడేళ్ల క్రితం శ్రీలంకను వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు అభివర్ణించాయి. కానీ పరిస్థితులు చాలా వేగంగా తారుమారయ్యాయి. దీనికి కారణం దేశ రాజకీయ నాయకుల వైఫల్యమనే చెప్పుకోవాలి. సంక్షోభం ముదరకుండా చూడటంలో అక్కడి నాయకులు దారుణంగా విఫలమయ్యారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు దక్షిణాసియాలోని చాలా దేశాల్లో ఒకటి తర్వాత ఒకటిగా బయటపడుతున్నాయి. పాకిస్తాన్‌లోని ఆర్థిక సంక్షోభం కావొచ్చు.. నేపాల్‌లోని రాజ్యాంగ సంక్షోభం కావొచ్చు.. ఇలాంటి సంక్షోభాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవి ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. ప్రస్తుతం శ్రీలంకలో కనిపిస్తున్న ప్రజా ఆగ్రహం నేడో రేపో పాకిస్తాన్ లేదా నేపాల్‌లోనూ కనిపించవచ్చు. ఇలాంటి వాటి వల్ల దక్షిణాసియా భద్రతకే పెను ముప్పు పొంచి వుంది.

 
చాలా దేశాల్లో ఇలానే..
ఇలాంటి సంక్షోభాలను పాకిస్తాన్, నేపాల్‌ల లాంటి దక్షిణాసియా దేశాలు అడ్డుకోగలవా? అక్కడి ప్రభుత్వాలు లేదా రాజకీయ నాయకులు వీటిని నియంత్రించగలరా? ప్రస్తుతానికి పాకిస్తాన్‌లో పరిస్థితులు ఇంతలా దిగజారే సూచనలు కనిపించడం లేదు. కానీ, నేపాల్‌లో మాత్రం కాస్త అనుమానమే. అక్కడి ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులను అడ్డుకోగలదా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ముఖ్యంగా శ్రీలంక తరహాలో ఆర్థిక పరిస్థితులు చేజారితే నేపాల్ నాయకత్వం అడ్డుకోలేకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా రాజకీయ నాయకుల మధ్య విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు కలిసివస్తే పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయి. వీటివల్ల దక్షిణాసియాలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

 
చైనా పాత్ర ఏమిటి?
శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్.. ఈ మూడు దేశాలకూ చైనాతో దృఢమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. మరి ప్రస్తుత శ్రీలంక సంక్షోభంలో చైనా పాత్ర ఏమిటి? శ్రీలంక విషయంలో చైనా చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. శ్రీలంకకు చైనా భారీగా రుణాలను ఇచ్చింది. మరోవైపు పెట్టుబడులు కూడా పెద్దయెత్తున పెట్టింది. ఇటీవల కాలంలో శ్రీలంకలో చైనా ప్రాబల్యం బాగానే పెరిగింది. శ్రీలంకలో ప్రస్తుత సంక్షోభానికి పూర్తిగా చైనానే కారణమని చెప్పలేం. అయితే, దీనిలో చైనాకు కూడా ప్రధాన పాత్ర ఉంది. ఆర్థిక లావాదేవీల విషయంలో చైనా ముందుంటుంది. రాజపక్ష కుటుంబానికి చైనా చాలా రుణాలు ఇచ్చింది. శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాన మంత్రి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చైనా ముందుకు వెళ్లింది. రాజపక్ష కుటుంబంపైనే ప్రధానంగా దృష్టిపెట్టింది. సామాన్యులను అసలు పట్టించుకోలేదు. ఒకవైపు రాజపక్ష కుటుంబ ఆస్తులు విపరీతంగా పెరుగుతుంటే... సామాన్యుల ఆర్థిక పరిస్థితి నానాటికీ క్షీణిస్తూ వచ్చింది.

 
నేర్చుకోవాల్సింది ఏమిటి?
శ్రీలంకకు నిజంగా సాయం అవసరమైనప్పుడు.. చైనా ఎక్కడా కనిపించలేదు. గత ఆరు నెలలుగా శ్రీలంక ఆర్థిక పరిస్థితి దారుణంగా పతనం కావడం మొదలైంది. కోవిడ్-19తో మొదలైన సంక్షోభం నుంచి శ్రీలంక ఆర్థిక పరిస్థితి కోలుకోవడం కష్టమైంది. దీని ప్రభావం సామాన్య ప్రజలపై తీవ్రంగా కనిపించింది. అయితే, ఈ సమయంలో శ్రీలంకను ఆదుకోవడానికి చైనా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. శ్రీలంక సంక్షోభానికి చైనా ఎలా దూరం జరిగిందో మిగతా దేశాలు చూసి పాఠాలు నేర్చుకోవాలి. వ్యాపారాలు చేయడం, లాభాలు అర్జించడంలో చైనా ముందుంటుంది. కానీ, సంక్షోభాల నుంచి గట్టెక్కించడంలో మాత్రం చివరన ఉంటోంది. ప్రస్తుతం శ్రీలంకను గట్టెక్కించేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)తో పాటు భారత్ కూడా సాయం చేసేందుకు ప్రయత్నిస్తోంది. కానీ, చైనా మాత్రం ముందుకు రావడం లేదు. శ్రీలంక స్థాయిలో పరిస్థితులు దిగజారకుండా పాకిస్తాన్, నేపాల్ ముందుగానే అప్రమత్తం కావాలి. ఎందుకంటే ఈ దేశాల్లో చైనా ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తోంది.

 
ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?
శ్రీలంకలో ప్రస్తుత సంక్షోభానికి పరిష్కారం ఏమిటి? ప్రస్తుతం అక్కడి అన్ని పార్టీలు కలిసి అఖిల పక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. కానీ, ఈ ఒక్క చర్యతో సమస్య పరిష్కారం కాకపోవచ్చు. మొదట అన్ని పార్టీలు కలిసి ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఒక ప్రణాళికను ఆమోదించాలి. ఆ తర్వాత దీన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ముందుకు తీసుకెళ్లాలి. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించగలిగే పక్కా ప్రణాళిక లేకపోతే, సాయం చేసేందుకు ఐఎంఎఫ్ ముందుకు రాకపోవచ్చు. శ్రీలంకలో రాజకీయ పరిస్థితులు మెరుగుపడితే గానీ, ఐఎంఎఫ్ కూడా ఏమీ చేయలేదు. అందుకే ఇక్కడి అన్ని పార్టీలు ముందు రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించి, ఆ తర్వాత ఆర్థిక ప్రణాళికతో ముందుకు రావాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భద్రాచలం వద్ద గోదావరమ్మ ఉగ్రరూపం.. ఫ్లడ్ అలెర్ట్