కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సమస్యలు పక్కదారి పట్టించడానికే ఈ సినిమాను విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశ్మీర్ ఫైల్స్ ఓ దిక్కుమాలిన వ్యవహారం అని సీఎం కేసీఆర్ అన్నారు.
ఆ ఘటనలో ఇబ్బందిపడ్డ వాళ్లు ఇప్పటికీ పరిహారం కోసం ఎదురుచూసే పరిస్థితి ఉందన్నారు. ఇది విద్వేషాలు రెచ్చగొట్టే చర్యగా విమర్శలు అందుకుంటోందన్నారు.
వాట్సప్‌లో ఉద్రేకాలు పెంచేందుకు ఓ వర్గం ప్రయత్నాలు చేయడం భారత సమాజానికి మంచిది కాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉద్యోగులకు సెలవులు ఇచ్చి కశ్మీర్ ఫైల్స్ సినిమా చూడాలని చెప్పడం వింత పోకడ అన్నారు. దేశం ఎటు పోతుందో అని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.
28న యాదాద్రికి అందరూ రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో రైతులందరినీ కలుపుకొని ఉద్యమించాలన్నారు. కేవలం టిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలే కాదని, అంతా కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఆయన ప్రసంగించారు.
రైతులను కాపాడుకునేందుకు బీజేపీపై తీవ్ర స్థాయిలో పోరాటం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
వ్యవసాయ ఉత్పత్తులకు రాజ్యాంగ రక్షణ అవసరం ఉందన్నారు.
తెలంగాణ ఉద్యమం కంటే తీవ్రంగా ఆందోళన చేపడదామన్నారు. మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు.
తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. విభజన చట్టం హామీలను మోడీ ప్రభుత్వం అమలు చేయడం లేదని విరుచుకపడ్డారు.
తెలంగాణ వ్యాప్తంగా 24, 25 తేదీల్లో ఆందోళనలు చేస్తామన్నారు. రైతు వేసే ప్రతి పంటకు కేంద్రం గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.