Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్ కస్టమర్‌కు ఎయిర్‌టెల్ షాక్..

airtel
, గురువారం, 28 ఏప్రియల్ 2022 (12:22 IST)
హైదరాబాద్ కస్టమర్‌కు ఎయిర్‌టెల్ షాకిచ్చింది. అంతర్జాతీయ రోమింగ్ సేవల పథకం కోసం సంప్రదిస్తే తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఆయనకు రూ.1,41,770 బిల్లు వచ్చింది. విదేశాలకు కుటుంబంతో కలిసి సరదాగా వెళ్లిన వ్యక్తికి తీవ్ర మనోవేదన మాత్రం మిగిల్చింది. 
 
ఈ వ్యవహారంలో భారతీ ఎయిర్‌టెల్ సంస్థ తీరును తప్పుపట్టిన హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-1 రూ.50వేల పరిహారం చెల్లించాలంటూ తీర్పు ఇచ్చింది. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని జల్‌వాయు టవర్స్‌లో ఉంటున్న విశ్రాంత వింగ్ కమాండర్ సమర్ చక్రవర్తి, భార్యతో కలిసి బహమాస్ అటు నుంచి యూఎస్ఏ వెళ్లాలనుకున్నారు.
 
అంతర్జాతీయ రోమింగ్ కోసం భారతీ ఎయిర్‌టెల్ సంస్థను ఆశ్రయించారు. 2014 నుంచి పోస్ట్ పెయిడ్ సర్వీస్ వినియోగిస్తున్నానని బేగంపేట్‌లోని ఎయిర్‌టెల్ సేవా కేంద్రం సిబ్బందికి తెలపగా అమెరికా ప్లాన్-బి వినియోగిస్తే బహమాస్‌లోనూ పనిచేస్తుందని చెప్పారు. ఫిర్యాదీ 2018 జూన్ 27న నూజెర్సీ చేరుకుని ఆమేరకు రూ.3,999 ప్లస్ రూ.149 రీఛార్జ్ చేయించారు. 
 
500 అవుట్ గోయింగ్ కాల్స్, 5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ ఎస్ఎంఎస్‌లు, ఇన్‌కమింగ్ కాల్స్ వర్తిస్తాయంటూ సందేశం వచ్చింది. కొత్త ప్లాన్‌ను యాక్టివేట్ చేసినప్పటినుంచి పలుమార్లు అంతర్జాతీయ రోమింగ్ సేవలు అందలేదని పదేపదే డిస్‌కనెక్ట్ అవుతోందని ప్రతివాద సేవా కేంద్రానికి సమర్ ఫిర్యాదు చేశారు. 
 
నాస్సౌ, బహమాస్ చేరుకోగానే బిల్లు రూ.1,41,770 అయ్యిందంటూ సందేశం వచ్చింది. అప్రమత్తమైన ఆయన మరోమారు సేవా కేంద్రాన్ని సంప్రదించగా, అక్కడ ఆ ప్లాన్ పనిచేయదంటూ చెప్పడంతో అవాక్కయ్యారు. దీంతో దిగొచ్చిన ఎయిర్‌టెల్ సంస్థ ఆ బిల్లులో కొంత మొత్తాన్ని తగ్గిస్తామంది. 
 
ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి. ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి. లక్ష్మీప్రసన్నతో కూడిన బెంచ్ ఇందులో ప్రతివాద సంస్థ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, తప్పుడు బిల్లును సరిదిద్దుకోవడంతో పాటు పరిహారాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. లేని పక్షంలో 12 శాతం వడ్డీతో కలిపి ఆ మొత్తాన్ని చెల్లించాలని తీర్పు ఇచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో అంబులెన్స్ మాఫియాకు చెక్ పెట్టిన సర్కారు!!