బాగా చదువుకున్న వాళ్లే తరచూ మోసపోతున్నారు. మరీ ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే గుడ్డిగా నమ్మి పెళ్లి వరకూ పోతున్నారు. ఆ తర్వాత నిజం తెలుసుకుని లబోదిబోమంటున్నారు. నిశ్చితార్థానికి రూమ్ కూడా బుక్ చేసి చివరి నిమిషంలో తాను మోసపోయానని గుర్తించిన సైబర్ పోలీసులకు మెహిదీపట్నం మహిళ ఫిర్యాదు చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో ఆమె రూ.40 వేలు కూడా పోగొట్టుకుంది. ఇంకా నయం అంతకుమించి మోసపోలేదు.
హైదరాబాద్‌లోని మెహిదీపట్నానికి చెందిన 35 ఏళ్ల మహిళ విద్యావంతురాలు. విజయనగర్ కాలనీలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఆమె లెక్చరర్‌గా పనిచేస్తోంది. రెండు నెలల క్రితం స్వీడన్‌కు చెందిన వాడినంటూ ఫేస్‌బుక్‌లో ఆమెకు పరిచయం అయ్యాడు ఓ వ్యక్తి. అలా వారి మధ్య స్నేహం పెరిగింది. ఇద్దరూ వాట్సప్ ద్వారా మాట్లాడుకోవడం వరకు పోయింది.
సదరు మహిళ బలహీనతల్ని అతను పసిగట్టాడు. ఒక రోజు అతను ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో ఆ 35 ఏళ్ల మహిళ మనసు పొంగిపోయింది. ఎండుతున్న చెట్టుపై చినుకులు పడినట్టుగా ఆమె జీవితంలో అతని మాటలు కొత్త ఆశల్ని చిగురింపజేశాయి.
ఈ నెల మూడోవారంలో అతను ఫోన్ చేసి తల్లిదండ్రులతో కలిసి వస్తున్నానని, నిశ్చితార్థానికి సిద్ధం చేయాలని కోరాడు. దీంతో ఆమె కొత్త జీవితంపై ఎన్నెన్నో ఊహించుకొంది. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో సూట్ అద్దెకు తీసుకొంది. నిశ్చితార్థానికి రెండురోజుల ముందు రావాలని ఆమె కోరగా, అతను సరేనన్నాడు.
ఈ నెల 24వ తేదీన మళ్లీ అతని నుంచి ఆమెకు ఫోన్. తాను ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఉన్నానని, తన వద్ద అధిక మొత్తంలో డాలర్లు ఉండటం వల్ల ట్యాక్స్ చెల్లించేందుకు రూ.40 వేలు పంపాలని కోరాడు. డబ్బు పంపడంలో కొంచెం ఆలస్యం కావడంతో, మళ్లీ అతనే విమానాశ్రయ అధికారిగా పరిచయం చేసుకొని ఆమెపై ఒత్తిడి పెంచాడు. దీంతో ఆమె అతనికి రూ.40 వేలు పంపింది. తన రాకుమారుడి రాక కోసం ఆమె ఎదురు చూడసాగింది.
ఈ నెల 24న వస్తానన్న మనిషి పత్తా లేకుండా పోయాడు. సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో తాను మోసపోయానని సదరు లెక్చరర్ గ్రహించింది. దీంతో తనలా మరొకరు మోసపోవద్దనే ఉద్దేశంతో సైబర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. జరిగిన విషయాన్నంత సైబర్ పోలీసులకు చెప్పి ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన నెంబర్ ఆధారంగా, అతనిది స్వీడన్ కాదని, నైజీరియా అని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో నిర్ఘాంతపోవడం ఆమె వంతైంది. ప్రస్తుతం పోలీసులు ఆ కేసు దర్యాప్తు చేస్తున్నారు.