Publish Date: Mon, 02 Feb 2026 (15:05 IST)
Updated Date: Mon, 02 Feb 2026 (15:14 IST)
తెలంగాణను చలి వదిలేట్లు లేదు. చల్లని రాత్రులు, సాధారణ పగటి ఉష్ణోగ్రతలు ఫిబ్రవరి నెల చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇది సాధారణంగా వచ్చే వసంతకాలపు వేడిని ఆలస్యం చేస్తోంది. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నుండి అందిన సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 7 లేదా 8వ తేదీ వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉంటాయి. పగటి ఉష్ణోగ్రతలు 29డిగ్రీల నుండి 31 డిగ్రీల మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల నుండి 16 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 1న సంగారెడ్డిలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 12.8డిగ్రీలుగా నమోదైంది. కాగా హైదరాబాద్‌లో 15.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది, ఇది సాధారణంగా ఈ సంవత్సర కాలంలో ఉండే ఉష్ణోగ్రత కంటే తక్కువ. రాబోయే 10 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షపాతం కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అంచనా వేసింది.
దీనివల్ల వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ ఆహ్లాదకరంగా ఉంటుంది. స్థిరమైన చలి, పగటిపూట మితమైన వేడి కారణంగా గత ఏడు సంవత్సరాలలో ఇది అత్యంత ఆహ్లాదకరమైన శీతాకాలాలలో ఒకటిగా నిలిచిందని అధికారులు తెలిపారు. గత కొన్ని సీజన్లలో కనిపించినట్లుగా అకస్మాత్తుగా వేడి పెరగకుండా, ఫిబ్రవరి నెల చల్లని వాతావరణంతో ప్రారంభమైంది.