తెలంగాణలో చలి వణికిస్తోంది. ఫెంగల్ తుఫాను ప్రభావం తగ్గుముఖం పట్టడంతో డిసెంబర్ రెండో వారంలోపు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కొమరం భీమ్ జిల్లాలోని సిర్పూర్‌లో బుధవారం ఉదయం 7.9 సెల్సీయస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.
ఇది ఈ సంవత్సరం తెలంగాణలో అత్యంత శీతల ప్రదేశంగా నిలిచింది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోనూ చలి తీవ్రత 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదైంది. హైదరాబాద్‌లో చలిగాలుల కారణంగా చల్లని వాతావరణం నెలకొంది.
తీవ్ర అల్పపీడనం తమిళనాడును సమీపిస్తున్నందున రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్ డాక్టర్ కె. నాగరత్న తెలిపారు. "హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటాయి. వాతావరణం తేమగా ఉంటుంది కానీ వేడిగా ఉండదు" అని చెప్పారు.
నవంబర్ 30 నుండి తెలంగాణ అంతటా మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 2 మిమీ నుండి 4 మిమీ వరకు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ మొదటి వారం తర్వాత ఉష్ణోగ్రతలు చల్లగా మారుతాయన్నారు.