నిద్రిస్తున్న యువకుడి పరుపులోకి ఓ కొండచిలువ దూరింది. పరుపులో కదలికను గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. కుక్కల అరుపులతో ఆ యువకుడు మేల్కొనడంతో ప్రాణగండం నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరులోని చెలిమిళ్ళ కాలనీలో ఘటన చోటుచేసుకుంది.
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు పట్టణంలోని చెలిమిళ్ల కాలనీలో పెళ్లూరు చెన్నకేశవులు ఆదివారం రాత్రి తన ఇంటి వరండాలో పరుపు వేసుకుని పడుకున్నాడు. తెల్లవారుజామున సుమారు 3:45 గంటల సమయంలో కుక్కలు అకస్మాత్తుగా అరవడం మొదలుపెట్టాయి.
దీంతో నిద్రలేచిన చెన్నకేశవులు, తన పరుపులో ఏదో కదులుతున్నట్టు గమనించాడు. వెంటనే లేచి చూసుకోగా తన పరుపులో ఉన్నది ఒక పెద్ద కొండచిలువ అని గ్రహించి భయపడిపోయాడు. వెంటనే తన పెద్దనాన్న సాయన్నకు సమాచారం అందించాడు.
చెన్నకేశవులు కేకలు విన్న చుట్టుపక్కల వారు గుమిగూడే సమయానికే, కొండచిలువ పరుపులోంచి బయటకు వచ్చి మెట్ల కిందకు వెళ్లి దాక్కుంది. స్థానిక యువకుడు మల్లేశ్ వెంటనే వనపర్తిలోని సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణ సాగర్‍కు సమాచారం అందించాడు. వెంటనే ఆయన సొసైటీ సభ్యులు చిలుక కుమార్ సాగర్, అవినాశ్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు.
స్నేక్ సొసైటీ బృందం అత్యంత చాకచక్యంగా, ఆ ఏడడుగుల పొడవు, 13 కిలోల బరువు గల కొండచిలువను బంధించారు. అనంతరం, పెద్దగూడెంలోని అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విజయ్ సమక్షంలో ఆ సర్పరాజును సురక్షితంగా విడిచిపెట్టారు. వర్షాకాలంలో ఇలాంటి సరీసృపాలు నివాస ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు.