బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం వుందని, వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో వచ్చే ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇందులో భాగంగా ఏపీలో తిరుపతి, కడప, అనంతపురం, కృష్ణా, గుంటూరు, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
తెలంగాణలో ములుగు, ఖమ్మం, ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.