ఇకపై ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసేవారిపట్ల మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. ముఖ్యంగా, చిన్నపిల్లలతో వెళుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు డబుల్ ఫైన్ విధించాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రతిపాదించింది. వాహనదారుల భద్రతను, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఈ ప్రతిపాదన చేసింది.
అంతేకాకుండా, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదా ఉల్లంఘన ఆధారంగా డ్రైవర్లకు మెరిట్ అండ్ డీమెరిట్ పాయింట్ విధానాన్ని కూడా ప్రతిపాదించింది. మోటర్ వాహనాల చట్టం సవరణల్లో భాగంగా, ప్రతిపాదించిన ఈ మార్పులపై అన్ని మంత్రిత్వ శాఖలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని రోడ్డు రవాణా శాఖ కోరినట్టు సమాచారం.
వాహనాల్లో చిన్నపిల్లలను తీసుకెళ్లే అనేక మంది తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పాఠశాల బస్సు డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని జరిమానాను రెట్టింపు చేయాలని ప్రతిపాదించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.