సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు. ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించగా.. ఓ దుండగుడు అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్నుతూ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టుగా ఉంది. ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాల కార్యకర్తలు, బీజేపీ నేతలు.. ముత్యాలమ్మ ఆలయం వద్దకు భారీగా చేరుకున్నారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆందోళనకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. ఘటనాస్థలిలో పెద్ద సంఖ్యలో మోహరించారు. అయితే ముత్యాలమ్మ ఆలయం వద్ద హిందూ సంఘాల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.
మహంకాళి ఆలయం వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. తమను అడ్డుకున్న పోలీసులపై నిరసనకారులు చెప్పులు విసిరారు. ఆందోళన చేస్తున్న హిందూ సంఘాల శ్రేణులకు డీసీపీ రష్మీ పెరుమాల్ నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోయింది.
చివరకు పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జ్ చేశారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో ఆందోళనకారుల్లో కొందరి తలలకు గాయాలయ్యాయి. మరికొంతమందికి శరీర భాగాల్లో గాయాలయ్యాయి. లాఠీఛార్జ్‌లో తన ఎడమ చెయ్యి విరిగిందంటూ దుర్గా అనే యువకుడు నేలపై కూలబడ్డాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.