తాము కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేయదలుచుకోలేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తామని, మిగిలిన సమయాల్లో రాష్ట్రాభివృద్ధి కోసం పని చేస్తామని చెప్పారు. అందువల్ల రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ సైతం సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయగా, ప్రధాని మోడీ సైతం సానుకూలంగా స్పందించారు.
తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ సోమవారం తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రూ.7 వేల కోట్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, మంత్రి సీతక్కలతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు ఆశీనులయ్యారు. ఆదిలాబాద్ వచ్చిన ప్రధాని మోడీకి సీఎం రేవంత్, మంత్రి, సీతక్కలు శాలువా కప్పి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలోనే తాము రాజకీయాలు చేస్తామన్నారు. మిగిలిన సమయమంతా రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పారు. కేంద్రంపై యుద్ధం చేయదలచుకోలేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘర్షణాత్మక వైఖరితో ముందుకు సాగితే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అన్నారు. ప్రస్తుతం ప్రధాని మోడీ ఒక పెద్దన్న తరహాలో రాష్ట్రానికి అన్ని విధాలా సహకరించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుహృద్భావ వాతావరణంలో, శాంతి, స్నేహపూర్వక వాతావరణం ఉండాలని కోరారు.
ముఖ్యంగా, మూసీ నది అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ పనులకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని 175 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినందుకు ఈ సందర్భంగా ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ సైతం సానుకూలంగా స్పందిస్తూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాల కేంద్రం సహకరిస్తుంది హామీ ఇచ్చారు.