Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేదిక్ క్లాక్ అంటే ఏంటి.. ఎక్కడ ఉంది? దాని ప్రత్యేక ఏంటి?

vedic clock

ఠాగూర్

, శుక్రవారం, 1 మార్చి 2024 (10:38 IST)
వేదిక క్లాక్ (వేద గడియారం) అంటే ఏంటి? ఈ తరహా గడియారం ఎక్కడుంది? దీని ప్రత్యేక ఏంటనే చర్చ ఇపుడు దేశ వ్యాప్తంగా సాగుతుంది. దీనికి కారణం లేకపోలేదు. ఈ వేదిక్ క్లాక్‌ను దేశ ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే తొలి వేద గడియారం కావడం గమనార్హం. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో ఏర్పాటు చేయగా, దీన్ని ప్రధాని మోడీ వర్చ్యువల్‌‌గా ప్రారంభించనున్నారు. ఈ గడియారం భారతీయ సంప్రదాయ పంచాంగం (కాల గణన పద్ధతి) ప్రకారం పని చేస్తుంది. ఉజ్జయినిలోని జంతర్ మంతర్ ఏరియాలో 85 అడుగుల ఎత్తున్న టవర్‌‍పై ఈ వేదిక్ క్లాక్‌ను అమర్చారు. 
 
ఈ గడియారం ప్రత్యేకతలను పరిశీలిస్తే, వేద హిందూ పంచాంగం సమాచారాన్ని ఈ 'వేద గడియారం' ప్రదర్శిస్తుంది. గ్రహాల స్థితిగతులు, ముహూర్తం, జ్యోతిషం గణనలు, అంచనాలకు సంబంధించిన సమాచారాన్ని డిస్ ప్లే చేస్తుంది. అంతేకాదు భారత ప్రామాణిక కాలం (ఐఎస్టీ), జీఎంటీ (జీఎంటీ)లను ఈ గడియారం సూచిస్తుంది. గడియారం సంవత్సరం, మాసం, చంద్రుడి స్థానం, శుభగడియలు, నక్షత్రం, సూర్యగ్రహణం, చంద్ర గ్రహణం వంటి ఇతర వివరాలను కూడా అందిస్తుంది. ఒక సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం ఆధారంగా ఈ గడియారం సమయాన్ని లెక్కిస్తుంది.
 
కాగా భారత కాల గణన విధానం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదని ప్రకటనలో నిర్వాహకులు పేర్కొన్నారు. భారత కాల గణన విధానం సూక్ష్మమైనదని, స్వచ్ఛమైనదని, దోషరహితమైనదని తెలిపారు. ప్రామాణికమైన, విశ్వసనీయత కలిగిన ఈ వ్యవస్థను ఉజ్జయినిలో వేద గడియారం రూపంలో తిరిగి ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉజ్జయిని నుంచి సూచించిన సమయాన్నే ప్రపంచమంతా వినియోగిస్తోందని అన్నారు. భారతీయ కాల గణన సంప్రదాయాన్ని ఈ వేద గడియారం ద్వారా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నామని నిర్వాహకులు ప్రకటనలో పేర్కొన్నారు.
 
హిమాచల్ ప్రదేశ్‌లో ఆపరేషన్ కమలంను అడ్డుకున్న ప్రియాంకా గాంధీ 
 
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ చేపట్టి ఆపరేషన్ కమలం కుట్రకు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ అడ్డుకట్ట వేశారు. తాజాగా జరిగిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ ఓడిపోగా, బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. దీంతో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ అనర్హత వేటు వేసింది. ఈ పరిణామాలతో ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి నెలకొంది. ఇందుకోసం బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం అస్త్రం ప్రయోగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 
 
ఈనేపథ్యంలో భాజపా చేసిన ఆపరేషన్‌ కమలంకు అడ్డుకట్ట వేసి ప్రజాతీర్పును రక్షించడంలో ప్రియాంకాగాంధీ కీలకపాత్ర పోషించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా కుట్ర పన్నిందని ఆరోపించిన కాంగ్రెస్‌.. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా పార్టీ నియంత్రణలోనే ఉన్నాయని తెలిపింది. ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కాషాయ పార్టీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొంది. ఇందులో పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకాగాంధీ కీలకపాత్ర పోషించారని.. అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు ఇతర సీనియర్లతో కలిసి చురుకుగా వ్యవహరించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా తిరుగుబాటు చేస్తే సహించేది లేదన్న సందేశాన్ని బలంగా పంపినట్లు పేర్కొన్నాయి.
 
'రాజ్యసభ ఎన్నిక తర్వాత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటు చూస్తే కాంగ్రెస్‌ చేతి నుంచి మరో రాష్ట్రం పోతుందని అనిపించింది. కానీ, పార్టీ అధిష్ఠానం వేగంగా, కఠినంగా వ్యవహరించింది. ఇది తిరుగుబాటు సంక్షోభాన్ని నివారించడమే కాకుండా ప్రభుత్వాన్ని కాపాడింది' అని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తాజా పరిణామాలతో ఆపరేషన్‌ కమలంకు అడ్డుకట్ట పడటంతోపాటు సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు ఇమేజ్‌ కూడా బలపడిందని పేర్కొన్నాయి. ఇదిలాఉంటే, 2022లో జరిగిన హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంకాగాంధీ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అంతకుముందు కూడా ఆమె అక్కడ ట్రబుల్‌ షూటర్‌గా పేరుగడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెల్లూరు జిల్లా వైకాపాలో సంక్షోభం... మరో వికెట్ డౌన్...