హైదరాబాద్ నగరంలో కొత్త రకం డేటింగ్ స్కామ్ వెలుగు చూసింది. అందమైన అమ్మాయిల మోజులో పడిన అనేక మంది యువకులు.. తమ మొబైల్ ఫోన్లలో డేటింగ్ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. అయితే, దీన్ని ఆసరాగా తీసుకున్న కొంతమంది పబ్ ఓనర్లు.. అమ్మాయిలతో కలిసి కొత్త మోసానికి తెరలేపారు. దీంతో కొంతమంది యువకులు భారీ మొత్తంలో నగదు పోగొట్టుకుని బోరుమంటున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఇటీవల టిండర్ డేటింగ్ యాప్‌లో ఒక అబ్బాయికి రితికా అనే అమ్మాయి పరిచయమైంది. అలా పరిచయమైన మరుసటి రోజే అబ్బాయిని కలుద్దామని చెప్పి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్దకు రావాలని కోరింది. దాంతో ఆ తర్వాత రోజు ఇద్దరూ మెట్రో స్టేషన్ వద్ద కలుసుకున్నారు. కొద్దిసేపు ఇద్దరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత ఆ అమ్మాయి పక్కనే ఉన్న గ్యాలేరియా మాల్లోని మోష్ క్లబ్‌కు వెళ్దామని అతడిని అడిగింది. అందుకు అంగీకరించిన యువకుడు రితికాను తీసుకుని ఆమె చెప్పిన క్లబ్‌కు వెళ్లాడు. అంతే.. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె తియ్యని మాటలు చెప్పి ఖరీదైన మద్యం ఆర్డర్ చేసి రూ.40,505 బిల్ కట్టించింది.
మోసపోయిన అబ్బాయి తర్వాత అనుమానం వచ్చి క్లబ్ తాలూకూ గూగుల్ రివ్యూస్ చూశాడు. దాంతో అతనికి ఇలాగే మోసపోయిన వేరే యూజర్ రాసిన రివ్యూ కనిపించింది. అప్పుడు అతనికి క్లబ్ వాళ్లు అమ్మాయిలతో కలిసి చేస్తున్న మోసమని అర్థమైంది. ఇలాగే ఆ అమ్మాయి, పబ్ చేతిలో చాలా మంది మోసపోయి రూ.20 వేల నుండి రూ.40 వేల నష్టపోయినట్లు గుర్తించాడు. దీనిపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.