Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మంచు' వారింట మంటలు... బౌన్సర్ల తోపులాట... చోద్యం చూసిన పోలీసులు..

Advertiesment
mohan babu - manoj

ఠాగూర్

, బుధవారం, 11 డిశెంబరు 2024 (09:55 IST)
సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఇంటిలో ఆస్తి పంపకాల వివాదం నెలకొంది. ఇది చిత్రపరిశ్రమలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి రంగారెడ్డి జిల్లా జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మోహన్ బాబు ఇద్దరు కుమారులైన మంచు విష్ణు, మంచు మనోజ్‌లు పోటాపోటీగా బౌన్సర్లను మొహరించారు. దీంతో వీరిమధ్య తోపులాట జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు మాత్రంం చోద్యం చూస్తుండిపోయారు. తమకేం పట్టనట్టుగా వారు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. 
 
ముఖ్యంగా, మోహన్ బాబు ఇంటికి చేరుకున్న మీడియా ప్రతినిధుల పట్ల ప్రైవేట్ బౌన్సర్లు ఇష్టారీతిన వ్యవహరించిన పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. మోహన్ బాబు మీడియా ప్రతినిధి నుంచి మైకు లాగేసుకుని దాడి చేసినప్పుడు పోలీసులు కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం పోలీసుల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం.
 
ఇక మనోజ్ గేటు తోసుకుంటూ లోపలికి వెళ్లినప్పుడు, దాడులు జరిగినప్పుడు మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, పహాడిషరిఫ్ ఇన్‌స్పెక్టర్ గురువారెడ్డి అక్కడే ఉన్నారు. ఆదివారం ఉదయం నుంచి వివాదం నడుస్తున్నా పరిస్థితులను అంచనా వేయకుండా అప్రమత్తంగా వ్యవహరించకపోవడం.. చివరకు దాడులకు వెళ్లేంత వరకూ ఎదురుచూడడం అనేది పోలీసుల నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది.
 
మంచు మనోజ్ కూడా పోలీసుల తీరును తప్పుబట్టారు. అవతలివర్గం కోసం కొత్త వ్యక్తులు లోపలికి వస్తున్నా అడ్డుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఇక మంగళవారం రాత్రి అప్పటికప్పుడు మహేశ్వరం అదనపు డీసీసీ సత్యనారాయణ మోహన్ బాబు ఇంటికి రావడం, హడావుడిగా సిబ్బందిని మోహరించడం జరిగింది. ఆ తర్వాత పరిస్థితులపై ఆరా తీశారు. 
 
మరోవైపు, మీడియా ప్రతినిధులపై దాడి చేసినందుకు నటుడు మంచు మోహన్ బాబుపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఆయనపై 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేసిన రాచకొండ పోలీసులు ఈరోజు ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
 
అయితే, మంగళవారం రాత్రి తీవ్ర ఘర్షణ తర్వాత మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. రాత్రి తోపులాటలో ఆయన తలకు గాయమైనట్టు సమాచారం. రాత్రి నుంచి వైద్యుల పర్యవేక్షణలో మోహన్ బాబుకి ట్రీట్మెంట్ జరుగుతోందని, ఇంకా వైద్యపరీక్షలు కొనసాగుతున్నాయని ఆయన పీఆర్ టీమ్ చెబుతున్నారు. 
 
ఇక మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మీడియా ప్రతినిధులకు మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జల్‌పల్లిలోని ఆయన నివాసం వద్ద జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో జోరుగా మద్యం విక్రయాలు.. తెగ తాగేస్తున్న మందు బాబులు