Case filed on Mohan Babu సీనియర్ నటుడు మోహన్ బాబుపై కేసు నమోదైంది. అదేసమయంలో ఆయన ఆస్పత్రిలో చేరారు. రంగారెడ్డి జిల్లా జల్‌పల్లిలోని తన నివాసం వద్ద మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో పహడీ షరీఫ్ పోలీసులు బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
మంచు కుటుంబంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో మోహన్ బాబు నివాసానికి మీడియా ప్రతినిధులు వెళ్లారు. ఈ క్రమంలో మోహన్ బాబుతో వచ్చిన బౌన్సర్లు, సహాయకులు, గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసేయడంతో పాటు కర్రలతో దాడి చేశారు. ఓ చానల్ ప్రతినిధి చేతిలో ఉన్న మైకును మోహన్ బాబు బలవంతంగా లాక్కొని చెవిపై కొట్టాడు. దీంతో అతనికి తీవ్ర గాయమైంది. మరో చానెల్ ప్రతినిధి కిందపడ్డాడు. ఈ దాడిని నిరసిస్తూ మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలావుంటే, మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. మోహన్ బాబు వెంట ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు ఉన్నారు. మంచు ఫ్యామిలీలో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మోహన్ బాబు, మంచు మనోజ్‌ల లైసెన్స్ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫిల్మ్ నగర్ పోలీసులు వీరిద్దరి తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.