Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంచు ఫ్యామిలీ వివాదంలోకి నా కుమార్తెను కూడా లాగారు : మంచు మనోజ్

Manchu Manoj

ఠాగూర్

, మంగళవారం, 10 డిశెంబరు 2024 (14:00 IST)
తమ కుటుంబంలో తలెత్తిన వివాదంలోకి తన ఏడు నెలల కుమార్తెను కూడా లాగడం బాధగా ఉందని హీరో మంచు మనోజ్ అన్నారు. తనపైనా, తన  భార్యపైనా తండ్రి మోహన్ బాబు పోలీసులకు చేసిన ఫిర్యాదుపై హీరో మంచు మనోజ్ స్పందించారు. తనతో పాటు తన భార్య మౌనికపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. 
 
తన తండ్రి లేవనెత్తిన అంశాలు పూర్తిగా తప్పే కాకుండా, తన పరువు మర్యాదలను కావాలని తీసే ప్రయత్నంలో భాగమైందన్నారు. తనపై, తన భార్యపై ఆరోపణలు పూర్తిగా కల్పితమన్నారు. తాను, తన భార్య మౌనిక సొంత కాళ్లపై నిలబడి సంపాదించుకుంటున్నామన్నారు. 
 
తన సోదరుడు కొన్ని కారణాల రీత్యా దుబాయికి వెళ్లడంతో ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటోందని.. నాన్న, ఆయన స్నేహితుల కోరిక మేరకు తాను కుటుంబానికి చెందిన ఇంట్లో గత ఏడాది కాలంగా ఉంటున్నానన్నారు. అయితే, తప్పుడు ఉద్దేశంతో తాను నాలుగు నెలల క్రితం ఆ ఇంట్లోకి వచ్చానని తన తండ్రి చేసిన ఫిర్యాదులో నిజం లేదన్నారు.
 
ఈ వివాదంలోకి తన ఏడు నెలల కూతుర్ని కూడా లాగడం బాధాకరమన్నారు. ఇది ఎంతో అమానవీయం, ఇలాంటి విషయాల్లోకి తన పిల్లలను లాగొద్దని మనోజ్ అన్నారు. ఇలా వారిని గొడవలోకి లాగడంతోనే ఈ ఆరోపణల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలుస్తుందని పేర్కొన్నారు. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానని పేర్కొన్నారు. ఇక తన తండ్రి ఇలా ఫిర్యాదు చేయడం యాదృచ్ఛికం కాదన్నారు. 
 
తన సోదరుడు విష్ణు, ఆయన అసోసియేట్ వినయ్ మహేశ్వరి.. మోహన్ బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) విద్యార్థులను, స్థానిక వ్యాపారులను దోపిడీ చేస్తున్నారు. వారికి మద్దతుగా బహిరంగంగా మాట్లాడినందుకే ఈ ఫిర్యాదు చేశారని మనోజ్ తెలిపారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, కావాలంటే వాటిని అధికారులకు సమర్పిస్తానని ఆయన పేర్కొన్నారు.
 
విష్ణు స్వలాభం కోసం కుటుంబం పేరును వాడుకున్నాడని, తానెప్పుడూ స్వతంత్రంగానే ఉన్నానన్నారు. విష్ణు కుటుంబ వనరులను దుర్వినియోగం చేశాడని, అయిన తన తండ్రి ఎప్పుడూ అతనికే మద్దతుగా ఉన్నాడని మనోజ్ తెలిపారు. తాను మాత్రం పరువు నష్టం, వేధింపులకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు.
 
కుటుంబ వివాదాల పరిష్కారం కోసం నిజాయతీగా, అందరిముందు చర్చలు జరపాలని గత సెప్టెంబరులో హృదయపూర్వంగా తన తండ్రిని వేడుకున్నానని మనోజ్ అన్నారు. అయితే, తండ్రి మోహన్ బాబు తనను పట్టించుకోలేదని, ఇప్పుడు ఇలా తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నానని వాపోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనోజ్ - మౌనికల నుంచి ముప్పు వుంది.. పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు