ప్రస్తుతం రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈజీగా మనీ సంపాదించేందుకు అలవాటు పడిన కొందరు వ్యక్తులు అమాయకులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ మహిళ రూ. 2.5 కోట్ల మోసానికి పాల్పడింది. కార్ల యజమానులను లక్ష్యంగా చేసుకుని.. అద్దె ఒప్పందం నెపంతో కార్లను అద్దెకు ఇవ్వడం.. వాటిని రెండు నెలల్లో విక్రయించడం చేసేది.అయితే ఆమె పోలీసులకు చిక్కింది. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి టెలికాం నగర్‌కు చెందిన జూపూడి ఉష అనే గృహిణి షేక్‌పేట నాలాకు చెందిన డ్రైవర్ తుడుముల మల్లేష్‌తో పరిచయమైంది.
సులభంగా డబ్బు సంపాదించాలనే తపనతో వీరు మోసానికి పాల్పడ్డారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి కార్లను అద్దెకు తీసుకుని అత్తాపూర్‌లో ఉంటున్న కర్ణాటకకు చెందిన సాగర్‌పాటిల్, జమనే అనిల్‌కుమార్ అనే వ్యక్తులకు విక్రయించారు. వారు కార్లను చౌకగా, రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు అమ్మి లాభం సంపాదించేవారు.
నగరంలో ఇలాంటి మోసాలు పెరిగిపోతున్నాయని పోలీసులు గుర్తించారు. ఇదే సందర్భంలో బీఎన్ రెడ్డి నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి అద్దెకు ఇచ్చిన కారును అమ్మాలనే ఉద్దేశంతో అద్దెకు తీసుకున్నాడు. బాధిత కారు యజమాని పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేసి కోర్టు ద్వారా కారును తిరిగి ఇచ్చారు.
వాహనాన్ని రికవరీ చేసేందుకు కారు యజమాని తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. అద్దె కార్ల డీలర్లు జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దని పోలీసులు సూచించారు. భవిష్యత్తులో సమస్యలను నివారించడానికి కార్లను అద్దెకు తీసుకున్న వారి పూర్తి వివరాలను ధృవీకరించాలని వారు సిఫార్సు చేస్తున్నారు.