ప్రముఖ సినీ నటుడు వరుణ్ సందేశ్ తల్లి డాక్టర్ రవణి భారతీయ జనతా పార్టీలో చేరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. ఆమెకు ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రమణి మాట్లాడుతూ, తమ కుటుంబానికి హిందుత్వం అంటే ఇష్టమని, అందుకే బీజేపీలో చేరినట్టు చెప్పారు. అలాగే సమాజ సేవ చేయడం అంటే తమకు ఎంతో ఇష్టమన్నారుు. రాష్ట్రంలో బీజేపీని మరింతగా బలపోతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఆమె చెప్పారు. తనను బీజేపీలోకి ఆహ్వానించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
సీనియర్ విద్యార్థులకు బార్ బిల్లు కట్టలేక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రంలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సీనియర్ విద్యార్థులు బారుకెళ్ళి సేవించిన మద్యానికి బిల్లు చెల్లించలేక ఇంజనీరింగ్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పైగా, సీనియర్ వేధింపులు మరింత ఎక్కువ కావడం, వారంతా కలిసి అవమానించడంతో అర్థాంతరంగా తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం లక్కారం గ్రామానికి జాదవ్ ప్రేమింగ్ పెద్దకుమారుడు జాదవ్ సాయితేజ(19) ఘట్కేసర్ మండలం కొర్రెములలోని సిద్ధార్ధ ఇంజినీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. నారపల్లిలోని వసతిగృహంలో ఉంటున్నాడు. మొదటి సంవత్సరం విద్యార్థి పుట్టినరోజు వేడుకలకు తోటి విద్యార్థి డేవిడ్ (రెండో సంవత్సరం)తో కలిసి సాయితేజ పాల్గొన్నాడు. అక్కడ వారి మధ్య గొడవ జరిగింది. ఈ విషయం సీనియర్ విద్యార్థి బండారి చిన్నబాబుకు తెలిసి ఇరువురికి నచ్చజెప్పి రాజీ చేయించాడు.
దీనికి బదులుగా పార్టీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆదివారం రాత్రి నారపల్లిలోని ఓ బార్ చిన్నబాబుతోపాటు ఏడుగురు విద్యార్థులు మద్యం తాగి రూ.8 వేల బిల్లు చేశారు. సాయితేజ తన వద్ద ఉన్న రూ.2,500 చెల్లించాడు. మిగతా డబ్బులకు చిన్నబాబు ఒత్తిడి చేయడంతోపాటు అవమానకరంగా మాట్లాడటంతో మనస్తాపం చెందిన సాయితేజ వసతిగృహానికి వెళ్లాడు. తండ్రికి వీడియోకాల్ చేసి.. చిన్నబాబు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి ఫోన్ పెట్టేశాడు. వసతిగృహం నిర్వాహకులకు తండ్రి సమాచారం ఇవ్వగా.. వారు వెళ్లి చూసేలోపు ఫ్యాన్కు ఉరేసుకొని మృతిచెందాడు.
కుమారుడి మృతికి కారణమైన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మందిపై ఎట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ ఆర్.గోవిందా రెడ్డి తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కళాశాల వద్ద, మేడిపల్లి ఠాణా, వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కళాశాల వద్ద పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి పోచారం ఐటీ కారిడార్ ఠాణాకు తరలించారు. చిన్నబాబు సంవత్సరం నుంచి తరగతులకు రావడం లేదని కళాశాల నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.