హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురిసింది. దీంతో భాగ్యనగరి నీటి మునిగింది. అనేక లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దాదాపు భాగ్యనగరిలోని అన్ని ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులపైకి వర్షపు నీరు వచ్చి చేరడంతో జన జీవనం అస్తవ్యస్తమైంది.. ముఖ్యంగా, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్ పల్లి, మూసాపేట, అమీర్ పేట, పంజాగుట్ట, కోఠి, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్ మార్గాల్లో వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకునిపోయాయి. రాయదుర్గం పీఎస్ పరిధి నలువైపులా వాహనాల్లో ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. నానక్ రామ్ గూడ సర్కిల్లో వాహనాలు వాననీటిలో చిక్కుకున్నాయి. రాత్రి 7 గంటల నుంచి వాహనాలు ముందుకు కదలడం లేదు.
అలాగే, హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో అత్యధికంగా 153 మి.మీ వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా శాలిగౌరారంలో 141.5 మి.మీ, గచ్చిబౌలిలోని ఖాజాగూడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద 133.8 మి.మీ, యాదాద్రి జిల్లాలోని అడ్డగూడురులో 131. మి.మీ వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ అధికారులు వెల్లడించారు.
మరోవైపు, ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్‌తో ఫోనులో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని సంసిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తంగా ఉంచాలని సూచించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 12 సెం.మీ. వరకు వర్షపాతం నమోదైందని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, వర్షం సమయంలో విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, మ్యాన్ హోల్ మూతలు తెరవొద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదిలావుంటే, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1762.70 అడుగులకు చేరింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అధికారులు గురువారం రాత్రి ఒక గేటును ఒక అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.