ఢిల్లీ మద్యం స్కామ్‌లో అరెస్టయన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, మాజీ మంత్రి కేటీఆర్ చెల్లి, ఎమ్మెల్సీ కె.కవిత అరెస్టయివున్నారు. ఆమెను విడిపించే ప్రయత్నాలు చేసేందుకు అన్న కేటీఆర్ ఆదివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అలాగే, కవితకు ఇంటి నుంచి భోజనం తెప్పించుకునే వెసులుబాటును కోర్టు కల్పించింది. ఆదివారం ఉదయం ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడున్న మీడియా ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించి ఆయన ఆగకుండా వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. చెల్లికి అండగా అన్న బయలుదేరి వెళ్లాడంటూ భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు కామెంట్స్ చేస్తూ కేటీఆర్ ఢిల్లీ వెళ్లే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను ఈడీ అధికారులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం శుక్రవారం సాయంత్రం వరకు కవిత ఇంట్లో సోదాలు చేసి సాయంత్రం 5.30 గంటల సమయంలో కవితను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆపై రాత్రి 8.30 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించారు. కవిత వెంట ఆమె భర్త కూడా వచ్చేందుకు అనుమతి ఇచ్చారు.
ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో శనివారం ఆమెను హాజరుపరిచగా, కోర్టు వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. కస్టడీలో ఉన్నంతకాలం రోజూ గంటపాటు కుటుంబ సభ్యులు, మిత్రులను కలుసుకునేందుకు కవితకు కోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే, ఇంటి భోజనం తెప్పించుకునేందుకు కూడా పర్మిషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో చెల్లి కవితను కలుసుకునేందుకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఆయన సాయంత్రం కవితతో సమావేశంకానున్నారు.