జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్‌లోని మంగళవారం జరిగిన ఉగ్ర చర్యను ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఒక ఊచకోతగా అభివర్ణించారు. ఉగ్రవాదులు మతం అడిగి మరీ హతమార్చడం దారుణమని అభిప్రాయపడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ, ఈ దాడి పూర్తిగా నిఘా వైఫల్యం వల్లే జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ దుశ్చర్యకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలన్నారు.
పహల్గామ్ ఘటన ఒక ఊచకోతగా అభివర్ణించారు. ముఖ్యంగా, ఉగ్రవాదులు మతం అడిగి మరీ అమాయక ప్రజలను అత్యంత కిరాతకంగా కాల్చి చంపడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. పహల్గామ్‌లో మతం అడిగిన తర్వాత ఉగ్రవాదులు అమాయక ప్రజలను విచక్షణారహితంగా కాల్చి చంపారు. ఈ కిరాతక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనకు నిఘా వైఫల్యమే ప్రధాన కారణం అని అన్నారు. ఇది గతంలోని ఉరి, పుల్వామా సంఘటనల కన్నా ప్రమాదకరమైనదని, తీవ్ర విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఉగ్రదాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని, బాధిత కుటుంబాలకు సాధ్యమైనంత త్వరగా న్యాయం చేయాలని ఆయన కోరారు. సైనిక దుస్తుల్లో వచ్చి అమాయక పర్యాటకులను లక్ష్యంగా చేసుకోవడం హేయమైన చర్య అని, నిందితులను కఠినంగా శిక్షంచాలని ఆయన కేంద్రాన్ని కోరారు.