జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు పైశాచిక దాడికి పాల్పడగా సుమారు 38 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీనికి కారణం కూడా పాకిస్థాన్ కావడం గమనార్హం. సరిహద్దుల్లో ఉన్న ఎయిర్ బేస్‌లకు పాకిస్థాన్ తన యుద్ధ విమానాలను తరలించడంతో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన ఆధారాలను నెటిజన్లు ఫ్లైట్ రాడార్ డేటాకు సంబంధించిన క్లిప్పింగులను పోస్టు చేసున్నారు.
ఫ్లైట్ రాడార్ డేటాలో పాకిస్థాన్ వాయుసేన విమానాలు కరాచీలోని దక్షిణ ఎయిర్ కమాండ్ నుంచి లాహోర్, రావల్పిండి సమీపంలోని ఉత్తర వైమానిక స్థావరాలకు చేరుకుంటున్నట్టు కనిపిస్తుంది. రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం పాకిస్థాన్ అతి ప్రధానమైన ఆపరేషనల్ బేస్‌లలో ఒకటి. ఈ నేపథ్యంలోనే బేస్ భద్రతా ఏర్పాట్లను పాక్ పటిష్టం చేసినట్టు ప్రచారం సాగుతోంది. అయితే, సరిహద్దులకు యుద్ధ విమానాల తరలింపు వార్తలపై అటు పాకిస్థాన్‌గానీ ఇటు భారత అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.