జమ్మూకాశ్మీర్‌లోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన పహల్గామ్‌లో దారుణం చోటుచేసుకుంది. పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ హఠాత్ పరిణామంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయానకంగా మారింది. ఈ ఘటనలో కనీసం 26 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
రక్తం మరకలతో ఉన్న ముఖంతో మరో మహిళ నిస్సహాయంగా చూస్తూ కనిపిస్తోంది. దాడి జరిగిన ప్రదేశంలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. ప్రాణభయంతో పర్యాటకులు పరుగులు తీశారు. దయచేసి నా భర్తను కాపాడండి. ఆయనను బతికించండి. అంటూ ఓ మహిళ చేసిన ఆర్తనాదాలు అక్కడ నెలకొన్న భీతావహ పరిస్థితి అద్దం పట్టాయి. కాసేపటి తర్వాత విగతజీవుడిగా ఉన్న భర్త పక్కనే దీనంగా కూర్చున్న ఆమె ఫోటో ఇపుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ప్రతి ఒక్కరూ ఆమె పరిస్థితి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.
మేము టిఫిన్ తింటుండగా ఓ వ్యక్తి వచ్చి నా భర్తపై కాల్పులు జరిపాడు అని ఓ బాధితురాలు కన్నీటి పర్యంతమైనట్టు సోషల్ మీడియా వీడియోల ద్వారా తెలుస్తోంది. రక్తపు ముడుగులో పడివున్న తమ వారిని ఆస్పత్రికి తరలించాలంటూ పలువురు చేసిన విజ్ఞప్తులు కంటతడి పెట్టించాయి. ఈ దాడిలో కర్నాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా మరణించినట్టు సమాచారం. ఆయన భార్య, కుమారుడు కళ్లెదుటే ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలిసింది.