జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది వరకు ప్రాణాలు హతం చేసిన ఘటనను అంతర్జాతీయ సమాజం ముక్తకంఠంతో దాడి చేస్తుంది. ఈ దాడి ఘటన తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముఖ్యంగా, పహల్గామ్ దాడి అనంతరం కాశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పాకిస్థాన్‌పై భారత వైమానిక దళం దాడి చేయొచ్చంటూ ప్రచారం సాగుతోంది.
మరోవైపు, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కాశ్మీర్ లోయను భయాందోళనల్లో ముంచెత్తింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు సమీప ప్రాంతాల్లో దాగివుండొచ్చని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాడి జరిగినప్పటి నుంచి కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అనుమానిత ప్రాంతాలను జల్లెడ పడుతూ, ఉగ్రమూకల కోసం వేట కొనసాగిస్తున్నాయి. దాడిలో సుమారు 8 నుంచి 10 మంది ఉగ్రవాదులు పాల్గొని ఉండొచ్చని వీరిలో ఐదు నుంచి ఏడుగురు ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు చెందిన వారిగా భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి.
ఇదిలావుంటే, ఈ దాడికి పాల్పడింది తామేనని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' ప్రకటించింది. దాడి సమయంలో ఉగ్రవాదులు కేవలం పురుషులనే లక్ష్యంగా చేసుకున్నారని, మహిళలు, చిన్నారుల జోలికి వెళ్లలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నట్టు సమాచారం. వ్యక్తుల గుర్తింపు కార్డులు పరిశీలించి, వారి మతాలను అడిగి తెలుసుకున్న తర్వాతే కాల్చిచంపారు. ఈ దాడిలో మొత్తం 26 మంది చనిపోయినట్టు సమాచారం. మృతుల్లో యూఏఈ, నేపాల్ దేశాలకు చెందిన ఇద్దరు విదేశీ పౌరులు కూడా ఉండటం గమనార్హం.
ఈ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ - పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. సరిహద్దులకు పాక్ తమ వైమానిక విమానాలను తరలిస్తున్నట్టు సమాచారం. దీంతో భారత్ కూడా అప్రమత్తమైంది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో పాక్‌పై భారత వైమానిక దళం దాడి చేసే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి.