ఆధునిక యుగంలోనూ బాల్య వివాహాలు జరుగుతున్న సందర్భాలున్నాయి. బాల్య వివాహాలను అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఏదో ఒక చోట బాల్య వివాహాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నందిగామలోని కందివాడకు చెందిన శ్రీనివాస్ గౌడ్‌కు(40) 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ళ బాలికతో ఇటీవల వివాహం జరిపించారు. ఈ విషయం సదరు బాలిక పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేసింది. ఉపాధ్యాయులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు బుధవారం రంగంలోకి దిగారు.
బాలిక తల్లితోపాటు వివాహం చేస్తుకున్న శ్రీనివాస్ గౌడ్, పురోహితుడు ఆంజనేయులు, మధ్యవర్తిగా వ్యవహరించిన పెంటయ్యలపై కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను ఐసీడీఎస్ అధికారుల సహకారంతో సఖీ కేంద్రానికి తరలించారు.
కాగా బాలికకు 18 సంవత్సరాలు వయస్సు నిండకుండా, బాలుడికి 21 సంవత్సరాలు నిండకుండా జరిగే ఏ వివాహమైనా బాల్య వివాహంగా చెబుతారు. బాల్య వివాహం చేసుకున్న పిల్లలు తమకు యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆ వివాహాన్ని రద్దు చేసుకోవడానికి కోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చు.
బాల్య వివాహం జరగబోతోందని సమాచారం అందిన వెంటనే.. మేజిస్ట్రేట్ ఆ వివాహాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయవచ్చు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కూడా కఠిన శిక్షలు ఉంటాయి.