పట్టణాలు, నగరాల్లో వీధి కుక్కల బెడద విపరీతంగా వుంటోంది. పాదచారులను, ద్విచక్రవాహనదారులను వెంటబడి మరీ కరుస్తున్నాయి. ఈ ఘటనల్లో కొందరు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. మరికొందరు ర్యాబిస్ వ్యాధి సోకి మరణిస్తున్నారు. తాజాగా హైదరాబాదులోని హయత్ నగర్‌లో ఏడేళ్ల బాలుడిపై 10 వీధి కుక్కలు దాడి చేసాయి.
శివగంగ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఆ బాలుడిపై మూకుమ్మడిగా కుక్కలన్నీ మీదపడి కరిచాయి. ఈ దాడిలో బాలుడి చెవి తెగిపోయింది. కుక్కల దాడి సమయంలో బాలుడు ఆర్తనాదాలు విని స్థానికులు వెంటనే కుక్కల్ని తరిమి బాలుడిని రక్షించారు. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాదు నగరంలో ఏదోచోట వీధికుక్కల దాడుల్లో గాయపడుతున్నవారు వుంటూనే వున్నారు. కుక్కలను అదుపుచేసేందుకు జిహెచ్ఎంసి అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.