Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ ఎన్నికలు :: నాడు జైకొట్టారు... నేడు ప్రత్యర్థులుగా మారారు... గురుశిష్యుల సమరం

Advertiesment
kcr vs etela
, శనివారం, 25 నవంబరు 2023 (09:51 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు స్థానాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. నాడు గురువులకు జైకొట్టిన శిష్యులే ఇపుడు ప్రత్యర్థులుగా మారారు. గురువు అత్యంత సన్నిహితంగా మెలిగి.. వారి బలాలు, బలహీనతలు తెలిసి.. వారికే కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతం శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో గురువులకు శిష్యులు సవాల్ విసురుతున్నారు. ఇలా సవాల్ ఎదుర్కొంటున్న వారిలో భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సహా పలువురు నేతలు ఉన్నారు. ఆయా చోట్ల పోటీ నువ్వా? నేనా? అన్నట్లుగా ఉంది. 
 
తెలంగాణ ఉద్యమం సమయంలో సీఎం కేసీఆర్‌కు కుడి భుజంలా ఉంటూ 2004 నుంచి 2018 వరకు అప్పటి తెరాస తరపున అప్రతిహతంగా గెలుస్తూ వచ్చిన ఈటల రాజేందర్.... ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ ప్రత్యర్థిగా మారారు. సూర్యాపేట నియోజకవర్గంలో బీఎస్సీ నుంచి పోటీ చేస్తున్న వట్టి జానయ్య యాదవ్ వాస్తవానికి మంత్రి జగదీశ్ రెడ్డి అనుచరుడే. అయితే మంత్రి తనపై కేసులు పెట్టి వేధిస్తున్నారనే కారణంతో బీఆర్ఎస్‌ను వీడి ఎన్నికల బరిలోకి దిగారు. నియోజకవర్గంలో యాదవ సామాజికవర్గం ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలో.. ఎన్నికల్లో జానయ్య ప్రభావం ఖచ్చితంగా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.
 
వనపర్తి నియోజకవర్గంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా ఒకప్పటి తన అనుచరుడి నుంచి సవాల్ ఎదుర్కొంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టి.మేఘారెడ్డి ఒకప్పుడు నిరంజన్ రెడ్డి వెంట ఉన్నవారే. ఇప్పుడు ఆయనే ప్రధాన ప్రత్యర్థిగా మారి.. మంత్రికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. మేఘారెడ్డి తన వెంట ఉన్న సమయంలో నియోజకవర్గంలో 'ఆయనకు ఆదరణ రోజురోజుకూ పెరగడాన్ని గుర్తించిన నిరంజన్ రెడ్డి ఈ పరిణామం భవిష్యత్తులో తనను ఇబ్బంది  కలిగిస్తుందని పసిగట్టి మేఘారెడ్డిని దూరం పెట్టారు. ఇపుడు ప్రత్యర్థిగా మారారు. 
 
ఇక కల్వకుర్తి నియోజకవర్గంలో ఒకప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి.. ఆ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు ప్రత్యర్ధిగా సవాలు విసురుతున్నారు. వీరిద్దరూ 2018 ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేశారు. తర్వాత వీరిమధ్య క్రమంగా దూరం పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం హోరాహోరీగా తలపడే స్థాయికి చేరింది. 
 
కాగా, ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ మధ్య ఒకప్పుడు సన్నిహిత సంబంధాలే ఉండేవి. తుమ్మల మంత్రిగా ఉన్న సమయంలో అజయ్ ఆయనతో సన్నిహితంగా ఉంటూనే ప్రత్యామ్నాయంగా ఎదిగారు. 2018 ఎన్నికల్లో తుమ్మల ఓడిపోవడం, అజయ్ గెలవడం, మంత్రివర్గంలో చోటుదక్కడంతో తుమ్మల వ్యతిరేక వర్గాన్ని చేరదీసి ఆయనకు ప్రత్యర్థిగా మారారు. తాజా ఎన్నికల్లో ఇద్దరూ ఖమ్మం నుంచి ఢీకొంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : మునుగోడు బరిలో 11 మంది స్థానికేతరులు