మహిళా ఓట్ల కోసం అభ్యర్థులు నానా తిప్పలు పడుతున్నారు. ఇందుకోసం మహిళా సంఘాలతో ఓటర్లకు అభ్యర్థులు ఎర వేస్తున్నారు. ఇందుకోసం ఖరైన బహుమతులు, పట్టు చీరలను మహిళా ఓటర్లకు పంపణీ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఎంత నిఘా పెట్టినా, ఎన్ని చర్యలు తీసుకున్నా. అభ్యర్థులు ప్రచారానికి భారీగా ఖర్చు చేయడంతోపాటు ఓటర్లకు రకరకాల తాయిలాలు అందుతున్నాయి. అయితే ఎంత ఖర్చు చేసినా, ఎవ రెవరికి ఎంత డబ్బు పంచినా.. చివరికి వారంతా ఓట్లు వేస్తారో, లేదోనన్న ఆందోళన అభ్యర్థులను పట్టిపీడిస్తుంది.
అందుకే చాలా మంది అభ్యర్థులు మహిళా ఓటర్లను ఎక్కువగా నమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. పురుషుల ఓట్ల కంటే.. మహిళల ఓట్లే నమ్మకంగా పడతాయనే ఉద్దేశంతో వారి ఓట్లను గంపగుత్తగా వేయించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా.. మహిళ ఓట్లను తమ వైపు తిప్పుకొంటే.. కుటుంబంలోని ఓట్లన్నీ వచ్చేందుకు అవకాశముంటుందన్న ఆలోచనతో వారిని మచ్చిక చేసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
అందుకే పలు పార్టీల అభ్యర్థులు, ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్‌లోని నియో జకవర్గాల్లో పోటీ చేస్తున్నవారు మహిళా సంఘాలపై గురిపెట్టారు. వారికి ఆయా గ్రూపుల వారీగా డబ్బు పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం నియోజకవర్గంలో ఉన్న మహిళా సంఘాల వివరాలు సేకరించేందుకు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆ టీమ్‌లు మహిళా సంఘాల వివరాలతోపాటు ఆ గ్రూపులోని మహిళల ఫోన్ నెంబర్లు సేకరిస్తూ, వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
సికింద్రాబాద్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఒక్కో మహిళా సంఘానికి రూ.10 వేల చొప్పున ఇచ్చినట్లు తెలుసుకున్న ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి.. ఈసారి రూ.20 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే మహిళా సంఘాల లీడర్లకు పూర్తి డబ్బులు ఇస్తే.. వారు గ్రూప్ సభ్యులకు పంపిణీ చేస్తారా? లేదా? అనే అనుమానాలు కూడా ఉన్నాయని, దాంతో గ్రూపులోని సభ్యురాళ్లందరి పుస్తకాలను ఏరియాల వారిగా అభ్యర్థుల అనుచరులు తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు మహిళా సంఘాల వారికి ఈ పుస్తకాలు తిరిగి ఇస్తామని చెప్పినట్లు తెలిసింది.
ఎన్నికలకు రెండు రోజుల ముందు ఒక్కో మహిళా సంఘాన్ని పిలిచి అందులోని సభ్యులందరికీ పుస్తకాలతోపాటు నగదు కూడా అందజేస్తారని సమాచారం. అంతేకాకుండా.. అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే మహిళలకు ఖర్చులు చెల్లిస్తున్నారు. ఇటీవల సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఓ డివిజనులో అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి పూర్తిగా మహిళా సంఘాల సభ్యులే ఉన్నారు. సాయంత్రం 7 గంటలకు జరగాల్సిన ఎన్నికల ప్రచార సభ, రాత్రి 9 గంటలకు జరగడంతో సభకు వచ్చినవారంతా వెళ్లిపోయారు. కానీ, మహిళా సంఘం సభ్యులు మాత్రం చివరి వరకు ఉండడం గమనార్హం. ఇదే పరిస్థితి అన్ని నియోజకవర్గాల్లోనూ కనిపిస్తుంది.