టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగమ్మాయి పీవీ సింధు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. గురువారం రౌండ్ ఆఫ్ 16 (ప్రీక్వార్టర్)లో జరిగిన మ్యాచ్‌లో వరుసగా మూడో విజయం సాధించింది. దీంతో సింధు క్వార్టర్ ఫైనల్స్ చేరింది.
ఈ మ్యాచ్‌లో డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ 12వ ర్యాంకర్ బ్లింక్ ఫెల్ట్‌పై 21-15, 21-13 తేడాతో గెలిచింది. తొలి రెండు మ్యాచుల మాదిరిగానే ఈ మ్యాచ్‌లో కూడా సింధు ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం కనబర్చింది. దీంతో ప్రత్యర్థి ఫెల్ట్ ఏ దశలోనూ ఆమెను నిలువరించలేకపోయింది.
తొలి సెట్‌ను 21-15 తేడాతో సులువుగా గెలుచుకున్న సింధు, రెండో సెట్‌ను 21-13 తేడాతో మరింత సునాయాసంగా గెలుచుకుంది. దీంతో మొత్తం 40 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. ఈ గెలుపుతో సింధు క్వార్టర్ ఫైనల్స్ చేరింది.
కాగా, రియో ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన సింధు ఈసారి మొదటి మ్యాచ్ నుంచే పతక వేటలో పడింది. మునుముందు కూడా ఈ దూకుడును సింధు ఇలాగే కొనసాగిస్తే భారత్ ఖాతాలో మరో పతకం చేరడం ఖాయం.