పారిస్‌లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో ఒలింపిక్స్ విలేజ్‌లో భారత అథ్లెట్లు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న భారత అధికారులు వారికి సహకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్రీడాకారులకు ఇప్పుడు వారి గదుల్లో ఎయిర్ కండిషనర్లు అందించబడతాయి. వీటిని ప్రభుత్వం ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా అందుబాటులో ఉంచింది.
శుక్రవారం ఉదయం క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI), ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA), ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం పాల్గొన్న సమన్వయ సమావేశం తరువాత, రాయబార కార్యాలయం 40 ఏసీలను కొనుగోలు చేసి, వాటిని ఇక్కడ అందించాలని నిర్ణయించింది.
భారత అథ్లెట్లు బస చేసే ఆటల విలేజ్ గదులలో ఈ ఏసీలు వుంటాయి. ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటికే ఏసీలను కొనుగోలు చేసిందని, వీటిని ఇప్పటికే ఒలింపిక్స్ గేమ్స్ గ్రామానికి డెలివరీ చేశామని క్రీడా మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
క్రీడాకారులు ఇప్పటికే ఏసీలను ఉపయోగించడం ప్రారంభించారు. మెరుగైన ఆటతీరుకు విశ్రాంతి అవసరమనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ పేర్కొంది.