Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంతర్జాతీయ యోగా దినోత్సవం: ఉరుకులు, పరుగుల జీవితానికి వరప్రసాదం

అంతర్జాతీయ యోగా దినోత్సవం: ఉరుకులు, పరుగుల జీవితానికి వరప్రసాదం
, సోమవారం, 20 జూన్ 2022 (16:29 IST)
జూన్ 21న 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకునేందుకు ప్రపంచం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2014లో కేంద్రంలో కొలువుదీరిన తర్వాత ఆయుర్వేదం, యోగా వంటి ఏడు సంప్రదాయ భారతీయ పద్ధతులను ప్రజారోగ్య సంక్షేమ వ్యవవస్థలోకి తీసుకొచ్చింది.  
 
2014 డిసెంబర్ నాటికి ఐక్యరాజ్య సమితిలోని 177 దేశాలు కలిసి యోగా ఆవశ్యకతను అంగీకరించి జూన్ 21న అంతర్జాతీయ యోగాదినోత్సవంగా ప్రతి సంవత్సరం జరిపేందుకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయి.  
 
"యోగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి సంపూర్ణమైన ఆరోగ్యం కోసం భారతదేశం ఇచ్చిన విలువైన కానుక" అని వివిధ జాతీయ, అంతర్జాతీయ వేదికలపైనా ప్రధాన మంత్రి బహిరంగంగానే వెల్లడించారు. యోగాలో అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తి, సనాతన జీవన విధానం నుంచి వారసత్వంగా వస్తోంది.
 
ఆదియోగి అయిన పరమేశ్వరుడు యోగాను మొదటిసారిగా వినియోగంలోకి తీసుకొచ్చినట్లు మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, భారతీయతత్వం ప్రతిపాదిస్తున్న సార్వత్రిక విలువల్లాగే యోగా కూడా విశ్వవ్యాప్త భావనను, ప్రాపంచిక ధృక్పథాన్ని బోధిస్తుంది. అందుకే యోగాకు సిద్ధాంతాలు, మతాలతో సంబంధం లేకుండా విశ్వవ్యాప్త గుర్తింపు, ఆమోదం లభించింది. 
 
ప్రపంచంలోని ప్రతి దేశం యోగాలోని శక్తిని, రోగనిరోధక సామర్థ్యాన్ని గుర్తించి వినియోగంలోకి తీసుకొచ్చాయి. యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకున్న వారందరూ.. ఆనందకర జీవితాన్ని పొందుతున్న తీరే ఇందుకు నిదర్శనం. వివిధ వ్యాధులకు సరైన చికిత్స నుంచి మరికొన్ని సమస్యలు రాకుండా నివారించుకునేందుకు యోగా ఓ సాధనంగా మారింది. 
 
21వ శతాబ్దపు ఉరుకులు, పరుగుల జీవితం వల్ల కలిగే ఒత్తిడుల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రపంచవ్యాప్తంగా యోగా మానవాళి ఆరోగ్యానికి అత్యవసర, నిత్యావసర సాధనకు వేదికైంది. 
 
యోగా అత్యంత ప్రాచీనమైన భారతీయ సంపద అయినప్పటికీ.. ఇటీవలి కాలంలోనే అంతర్జాతీయంగా గుర్తింపు దక్కడం, ప్రజలు ప్రపంచవ్యాప్తంగా యోగాను ఆమోదించి తమ దైనందిన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవడం వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పోషించిన పాత్ర చిరస్మరణీయం, అభినందనీయం అనే చెప్పాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అగ్నిపథ్ మూలాల వేట కోసం నరసారావు పేటకు వచ్చిన ఐటీ - ఐటీ బృందాలు