Publish Date: Thu, 19 Nov 2020 (19:22 IST)
Updated Date: Thu, 19 Nov 2020 (19:25 IST)
కరోనా నేపథ్యంలో లోకక్షేమాన్ని కాంక్షిస్తూ పవిత్రమైన కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన కార్యక్రమాల్లో మొదటగా విష్ణుసాలగ్రామ పూజ గురువారం తిరుమల వసంత మండపంలో ఆగమోక్తంగా జరిగింది. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వసంత మండపానికి వేంచేపు చేశారు.
ఈ మండపంలో శ్రీ భూవరాహస్వామి, శ్రీ ఆంజనేయస్వామివారి ప్రతిమలను ఏర్పాటుచేశారు. అదేవిధంగా, ఉసిరి, లక్ష్మీ తులసి, రామతులసి, కృష్ణతులసి తదితర పవిత్రమైన చెట్లను కొలువుదీర్చారు. ముందుగా ప్రార్థనా సూక్తం, అష్టదిక్పాలక ప్రార్థన, నవగ్రహ ప్రార్థనతో విష్ణుసాలగ్రామ పూజను ప్రారంభించారు.
అనంతరం వేదపండితులు వేదమంత్రాలు పఠిస్తుండగా అర్చకులు సాలగ్రామాలకు పాలు, పెరుగు, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, సాలగ్రామాలకు హారతులు సమర్పించారు. నైవేద్యం సమర్పించిన అనంతరం క్షమా మంత్రం, మంగళంతో ఈ పూజ ముగిసంది.
ఈ సందర్భంగా వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు మాట్లాడుతూ సాలగ్రామాలు సాక్షాత్తు విష్ణువు అవతారమని, సాలగ్రామ పూజ వల్ల సర్వజన రక్షణ, సమస్త బాధల ఉపశమనం కలుగుతాయని తెలిపారు. సాలగ్రామాలకు చేసిన అభిషేక తీర్థాన్ని సేవిస్తే సమస్త పాపాలు తొలగి, సర్వవ్యాధులు నివారించబడతాయన్నారు.