తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంప్రదాయబద్దంగా వస్తున్న 'గొల్ల' విషయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే పుష్కర కాలం క్రితం జరిగిన '300 డాలర్ల' వ్యవహారంపై పునర్విచారణ చేయాలని నిర్ణయించడం తి.తి.దే ఉద్యోగులలో అంతర్గతంగా కలకలం రేగింది. అలాగే 'అన్నవరం'లో జరిగిన అన్యమత ప్రచారంపై కూడా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
'సన్నిధి గొల్ల'కే హక్కు:
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ద్వారాన్ని తెరిచే హక్కు సన్నిధి గొల్లకే ఉంది. సంప్రదాయంగా వచ్చే హక్కును ఉద్యోగంగా మార్చివేయడంపై గతంలో పెద్దఎత్తున ఉద్యమం చేశారు. దేశవ్యాప్తంగా ఆ వర్గానికి చెందిన వారు గత కొద్ది సంవత్సరాలుగా దశలవారీగా పోరాటాలు చేశారు. ఈ పోరాట ఫలితంగా వంశపారంపర్యంగా వస్తున్న సన్నిధి గొల్లను తిరిగి వారి వంశానికే అప్పగించేందుకు త్వరలో ప్రభుత్వం జీఓను విడదల చేయనుంది.
మా పోరాటం ఫలించింది: మేళం శ్రీనివాస్ యాదవ్
శ్రీవారి ఆలయం ద్వారాన్ని తెరిచే హక్కు సన్నిధి గొల్లకే ఉందని, సంప్రదాయంగా వచ్చే హక్కును ఉద్యోగంగా మార్చివేయడంపై దశాబ్దాలుగా ఉద్యమం చేశామని, ఇప్పటికి అది నెరవేరిందని, ఇది తమ ఒక్కరి విజయం కాదని, సంప్రదాయాలను పాటించే శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులదని, సీఎం జగన్ శ్రీకాళహస్తి పాదయాత్రలో తమ సభ్యులు చేసిన వినతికి స్పందిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేయాలని సంకల్పించడం పట్ల అఖిల భారత యాదవ సంఘ గౌరవ సభ్యులు మేళం శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.