కలియుగ వైకుంఠంగా భావించే ఏడు కొండలు ఎక్కాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) మరో షాక్ ఇచ్చింది. ఇష్టమొచ్చినపుడు కొండెక్కాలనుకుంటే ఇకపై వీలుపడదు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు వీలుగా ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	కరోనా రెండో దశ విస్తరిస్తున్న నేపథ్యంలో సాధారణ భక్తుల రద్దీని నియంత్రించేందుకు టీటీడీ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. వీటి ప్రకారం టైం స్లాట్ టికెట్లు ఉన్నప్పటికీ.. భక్తులు ఎప్పుడు పడితే అప్పుడు కొండెక్కేద్దామంటే  వీలుపడదు. టైం స్లాట్‌లో పేర్కొన్న సమయానికి కొన్ని గంటల ముందు మాత్రమే కొండపైకి అనుమతిస్తారు. 
 
									
										
								
																	
	 
	వాస్తవానికి ప్రస్తుతం తిరుపతిలోని రైల్వే స్టేషన్ ముందున్న విష్ణునివాసంతో పాటు అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లో రోజుకు 20 వేల టైంస్లాట్ సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తున్నారు. రద్దీ రోజుల్లో మరో 5 వేల టోకెన్ల కోటా పెంచుతున్నారు. ఈ టోకెన్లు పొందిన వారికి మరుసటిరోజు నుంచి దర్శనం కల్పిస్తున్నారు. 
 
									
											
									
			        							
								
																	
	 
	అయితే.. దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు కావొచ్చు లేదా స్థానికులు కొంతమంది కావొచ్చు మరుసటిరోజు వరకు ఆగకుండా టోకెన్ తీసుకున్న వెంటనే కొండెక్కేస్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోతోంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో ఈ రద్దీని నియంత్రించాలని టీటీడీ నిర్ణయించింది. 
 
									
			                     
							
							
			        							
								
																	
	 
	దీనిలో భాగంగా టైం స్లాట్ టోకెన్ పొంది కాలినడకన వచ్చే భక్తులను ఉదయం 9 గంటలకు, వాహనాల్లో వచ్చే వారిని మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత అనుమతించనున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఈ నూతన విధానంపై నిర్ణయం తీసుకోవడం, అమలు చేయడం వంటివి ఆకస్మికంగా జరగడంతో సోమవారం పలువురు భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. 
 
									
			                     
							
							
			        							
								
																	
	 
	టోకెన్ ఉన్నా తమను ఎందుకు కొండపైకి పంపడం లేదని విధుల్లో ఉన్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో కొత్త నిబంధనలపై సిబ్బంది వివరించి భక్తులను శాంతింపజేశారు. దీనిపై తితిదే అధికారులు స్పందిస్తూ, కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ తరహా విధానాన్ని అమల్లోకి తెచ్చామని, ఇందుకు భక్తులు కూడా సహకరించాలని కోరారు.